24-01-2026 12:38:15 PM
ఘట్ కేసర్, జనవర్ 24 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలో దక్షిణ దిక్కులో కొండ గట్టుపైన వెలసిన మహిమగల దేవత ఘట్టుమైనమ్మ. కోరిన కోర్కెలు తీర్చే కొండ పుత్రికను ప్రజలు గ్రామదేవతగా కొలుస్తారు. ఘట్టమైసమ్మ అంటే కొండపైన వెలసిన మైసమ్మ పేరునకే ఘట్ కేసర్ గ్రామం పేరు వచ్చిందని కొందరి ప్రగాఢ విశ్వాసం, ప్రతి సంవత్సరం పుష్యమానంలో జరిగే మకర సంక్రాంతి పర్వదినం అనంతరం వచ్చే ఆదివారం గ్రామదేవత జాతరను ఘనంగా జరుపుకుంటారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఘనంగా జరుపుకునే ఏకైక పండగ ఈగ్రామ దేవత జాతరేనని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు భక్తితో కొలిచే ఘట్టు మైసమ్మకు చాలా మహిమలు గల దేవతగా ప్రఖ్యాతి ఉంది. గ్రామస్తులు తమ గ్రామదేవరకు మొక్కులు మొక్కితే గ్రామానికి
శుభం జరుగుతుందని, పాడిపంటలు పుష్కలంగా పండుతాయని గ్రామస్తుల విశ్వాసం. దిగంబరంగా ఉండే ఘట్టుమైనమ్మ గ్రామానికి ఎటువంటి అరిష్టం కలుగకుండా చూస్తుందని ప్రజలు విశ్వసిస్తుంటారు. గ్రామ దేవతను వేడుకుంటే మందులతో నయంకాని మొండి రోగాలు సైతం నయమవుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల అచెంచల విశ్వాసం. మైసమ్మ జాతర గ్రామ ప్రజలందరూ దేవాలయ సమీపంలో గుడారాలు వేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో ప్రజలు అమ్మవారికి నైవేద్యంతో కూడిన బోనాలతో, డప్పు వాయిద్యాలతో, శివసత్తులతో ఆటపాటలతో అమ్మవారి దేవాలయానికి చేరుకొని దేవతకి సమర్పించుకుంటారు. ప్రతి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.