19-06-2025 12:00:00 AM
జయశంకర్ భూపాలపల్లి ( మహబూబాబాద్) జూన్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు 90,837 మంది రైతులకు 72 కోట్ల 30 లక్షల 42 వేల 624 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న రైతులకు రైతు భరోసా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలోని 282 గ్రామాల్లో 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారని, ఇందుకు 143,99,06,145 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రైతు భరోసా నిధులను జమ చేయడానికి బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం సమర్థవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు. వానకాలం పంటల సాగుకు ముందే రైతులకు సాగు పెట్టుబడి అందడంతో జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆనందంతో ఉన్నారని కలెక్టర్ వివరించారు