13-11-2025 12:45:10 AM
పోడు భూముల సాగు పనులను అడ్డుకున్న సిబ్బంది
నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టలో ఉద్రిక్తత
దేవరకొండ, నవంబర్ 12 (విజయక్రాంతి): అటవీ శాఖ అధికారులపై నల్ల గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామస్తులు బుధవారం దాడికి పాల్ప డిన సంఘటన చోటు చేసుకుంది. గువ్వలగుట్ట రైతులు పోడు భూములకు సాగు చేసేందుకు చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు గ్రామానికి వెళ్లి అటవీ భూముల్లో మీరు వ్యవసాయం ఎలా చేస్తారని రైతులను ప్రశ్నించారు.
ఈ భూములకు సంబంధించిన ఫారెస్ట్ పట్టా పాస్ పుస్తకాలు చూపెట్టి సేద్యం చేసుకోవాలని అటవీ అధికారులు సూచించారు. దీంతో అటవీ అధికారులు, రైతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రైతులు, అధికారుల మధ్య ఘర్షణ జరగగా.. ఈ ఘటనలో ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి.
మాకు ఉన్న కొద్దిపాటి పోడు భూములను సాగు చేస్తుంటే ప్రతిసారి అటవీ అధికారులు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దాడిలో గాయపడిన ఫారెస్ట్ అధికారులను దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడిలో పాల్గొన్న రైతులపై చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.