కొనుగోలు కేంద్రాలు కరువు..?
అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా స్పందన జీరో
మార్కెట్లోకి వరి, మొక్కజొన్న, జొన్నలు..
కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఎదురుచూపులు
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్న రైతులు
ఇప్పటికైనా అధికారులు స్పందించేనా...?
కామారెడ్డి/తాడ్వాయి,ఏప్రిల్,28, (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేక ఒకవైపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తాము పండించిన ధాన్యాన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి తెస్తే సరైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అమ్ముకుందామంటే అవస్థలు పడుతున్నారు. ఇదే అదనగా భావించి ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్దకు వచ్చి ధాన్యాలను కొనుగోలు చేస్తున్నారు.
మద్దతు ధర దేవుడు ఎరుగు కానీ తరుగు తీస్తూ రైతులను నిలువు దోపిడికి గురి చేస్తున్నారు. దీంతో పాటు మద్దతు ధర కూడా చెల్లించడం లేదు. ప్రభుత్వం ప్రవేట్ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని అమ్మకాలు చేపట్టి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరలు పొందాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు చెప్తున్నారు తప్ప మాటలకే పరిమితమవుతున్నారు.
రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు ఏర్పాటు చేసిన కొనుగోలు కే ంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.రైతులు రాత్రనకా పగలనకా కష్టపడి పండించిన ధాన్యాన్ని బయట మార్కెట్లో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి మోసం చేస్తున్నారు.దళారుల బారీ నుంచి రైతులను రక్షించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని లింగంపేట్, సదాశివ నగర్, తాడ్వాయి, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, భిక్కనూర్, దోమకొండ, మాచారెడ్డి తదితర మండలాలలో ఈ రబీ సీజన్లో రైతులు వేల ఎకరాల్లో మొక్కజొన్నలు, వరి ధాన్యం, జొన్నలు తదితర పంటలు పండించారు. పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు కొనుగోలు కేంద్రాలు కూడా అందుబాటులో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వం రైతులను ఆదుకుంటాం,రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తాం అని చెబుతున్న ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. తాడ్వాయి మండలంలోని బ్రాహ్మణపల్లి, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి, చిట్యాల, నందివాడ, ఎర్రపహాడ్, తాడువాయి, దేమికలాన్, కన్కల్, చందాపూర్, సంగోజివాడి గ్రామాల్లో రైతులు వందల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేసుకున్నారు. ఈ మక్కలను మార్కెట్లో విక్రయించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
వెంటనే ప్రభుత్వం మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం స్పందించి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. క్వింటాలకు ప్రభుత్వం రూ.2400 మద్దతు ధర అందించి మక్కలు కొనుగోలు చేస్తుంది. దీంతో రైతులకు సరైన ధర లభించే అవకాశం ఉంటుంది.గిట్టుబాటు ధర లభిస్తుంది.ఒక్కో ఎకరాకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ధాన్యాన్ని పండిస్తే మక్కలు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
దళారులు రూ.1700 కు క్వింటాల్ కొనుగోలు
బయట మార్కెట్లో దళారులు ఒక క్వింటాలు మక్కలను రూ.1700 లకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు ఒక్కో క్వింటాలకు రూ.700 నష్టపోయే అవకాశం ఉంది. ఒక్కో రైతు 50 నుంచి 200 క్వింటాళ్ల మక్కలు పండిస్తున్నారు. 100 క్వింటాళ్ల మక్కలకు రూ.70 వేలు నష్టపోయే ప్రమాదం ఉంది. కష్టపడ్డాదంతా దళారులకే వెళ్ళిపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాడువాయిలో మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి..
మక్కల, వరి ధాన్యం, జొన్నల కొనుగోలు కేంద్రం విషయమై స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి సైతం తీసుకువచ్చిన స్పందన లేదు. ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి ఎమ్మెల్యేలో స్పందించాలని రైతులు కోరుతున్నారు. గతంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించడంతోనే తాడ్వాయిలో రెండవసారి మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు అయిందని రైతులు తెలిపారు.
ప్రస్తుతం సైతం ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. రైతులు ధాన్యాన్ని, మొక్కజొన్నలను, జొన్నలను కుప్పలుగా పోసుకొని కొనుగోలు కేంద్రాల కోసం దిగాలుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఎప్పుడు మక్కలు విక్రయించుకుంటామని ఎదురుచూస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి కొనుగోలు కేంద్రాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలి.
రైతులకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి
అధికారులు స్పందించి వెంటనే తాడువాయిలో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఒక్కో క్వింటాల్ కు రూ.700 నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తాం.
పైడి విట్టల్ రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి
దళారులతో నష్టపోతాం
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే దళారులతో నష్టపోతాం దళారులు తాము పండించిన మక్కలను తక్కువ ధరకు తీసుకుంటున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతాం. వెంటనే అధికారులు స్పందించి తాడ్వాయి లో మక్కలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి.
నాంపల్లి, రైతు, బ్రహ్మాజీ వాడి






