పెట్రో.. తిప్పలు
- పెట్రోల్ పంపుల్లో భారీ రద్దీ
- ఆందోళన వద్దన్న కేంద్రం
- సమృద్ధిగా సరఫరా ఉందన్న పౌరసరఫరాల శాఖ
- అధికారుల తీరుపై వాహనదారుల మండిపాటు
- వాస్తవాలు భిన్నంగా ఉన్నాయంటున్న వినియోగదారులు
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు పెరగనున్నాయనే ఆందోళన నేపథ్యంలో మరోమారు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పెట్రోల్ పంపుల్లో భారీగా రద్దీ నెలకొంది. ఒకేసారి వాహనాల్లో ఇంధనం పోయించుకోవడం ఇతర వాహనాలకు ఇంధనం లభించడం లేదు. ఈ నేపథ్యంలో పలు పెట్రోల్ బంకుల్లో నోస్ట్రాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న మిగతా పెట్రోల్ బ్యాంకుల్లో భారీగా వాహనదారుల క్యూలైన్లు మొదలయ్యాయి. పలుచోట్ల డబ్బాలు, బకెట్లు సైతం పెట్టి తమ నెంబర్ కోసం ఎదురుచూడటం విశేషం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోమారు కీలక ప్రకటన చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం లేదని మరోమారు తేల్చి చెప్పింది. ఎన్నికల తరువాత ధరలు పెంచనున్నారనే వార్తలను కొట్టిపారేసింది. దేశంలో సరిపడా నిల్వలున్నాయని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని, ధరలు పెంచడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు.
డిమాండ్‌ను మించి పెట్రోల్, డిజీల్ సరఫరా చేస్తున్నామని ఎలాంటి భయాందోళనలు చెందొద్దన్నారు. ఒక్కసారిగా ఇంధనం పోయించుకోవడం వల్లే సమస్య ఏర్పడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఆయా పెట్రో లియం సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు ఇంధనం సరఫరా అయ్యేలా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో చమురు కొరత లేదని తెలంగాణ పెట్రోల్, డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చమురు కొరత, పెట్రోల్ డీజిల్ దొరకదు అంటూ వస్తున్న వార్తల కారణంగా చాలా మంది తమకు అవసరమైన దాని కంటే ఎక్కువగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడం వల్ల కూడా పెట్రోల్ బంకుల మూసివేతలకు, క్యూలైన్లకు, ప్రజల్లో ఆందోళనలకు కారణమవుతుందన్నారు.
ప్రస్తుతా నికైతే దేశంలో, రాష్ట్రంలో పెట్రోల్, డిజీల్ కొరత లేనేలేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఉదయం నుంచి పెట్రోల్ పంపుల వద్ద వాహనాలు బారులు తీరాయి. పలు పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిచ్చాయి. మరికొన్ని రూరల్ ప్రాంతాల్లో డబ్బాలతో పెట్రోల్ బంకుల్లో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పలు పెట్రోల్ పంపుల్లో పోలీసు బందోబస్తు మధ్య ఇంధనం వినియోగదారులకు పంపిణీ చేశారు. నిర్మల్ జిల్లాలోనూ పెట్రోల్, డీజిల్ కొరతతో సోమవారం రాత్రి నుంచే పలు పెట్రోల్ పంపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
నిర్మల్, బైంసా, ఖానాపూర్, ముధోల్, బాసర, సారంగాపూర్, కుంటాల, దిల్వార్పూర్, లోకేశ్వరం తదితర ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంకుల వద్దకు వచ్చిన వాహనదారులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. భద్రాద్రి జిల్లాల్లో చాలా పెట్రోల్ పంపుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమీయడం, పలు పెట్రోల్ పంపుల్లో గంటల తరబడి వాహనదారులు వేచి ఉండాల్సి రావడంతో అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిల్వలున్నాయని అపోహలు, ఆందోళనలు వద్దని చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమృద్ధిగా ఇంధనం పంపులకు అందజేస్తే ఈ పరిస్థితులు ఎందుకు ఉత్పన్నం అవుతాయని ప్రశ్నిస్తున్నారు.
ఇంధన ధరలు పెరగవు
- దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
- బంకుల వద్ద బారులు తీరవద్దు
- కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౨౮: పశ్చిమ బెం గాల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన (పెట్రోల్, డీజిల్) ధరలు పెరుగుతాయని సోషల్‌మీడియా వేదికగా జరుగు తున్న ప్రచారంలో నిజం లేదని మంగళవారం కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగినా, ప్రస్తుతానికి ధరలు పెంచే ఆలోచనే లేదని తేల్చిచెప్పింది. ధరలు పెరుగుతాయని, దేశంలో ఇంధన నిల్వలు లేవని కొన్ని రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారని, వాహనదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. దేశీయంగా చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఉన్నఫళంగా బంక్‌లకు వెళ్లి ఇంధనం తీసుకెళ్లడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. చమురు కంపెనీలు ప్రస్తుతం కొంతమేర నష్టాలు చవిచూస్తున్నాయన్న సంగతి వాస్తవమేని, అయినప్పటికీ.. యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి విని యోగదారులపై అదనపు భారం పడకుండా చూస్తున్నామని వెల్లడించింది. ధరల పరిస్థితిని, ఇంధన నిల్వలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపింది.






