29 July, 2026 | 1:18 AM

ఆరుతడి పంటలను సాగు చేయండి

29-07-2026 12:00 AM

కలెక్టర్ కె.హైమావతి

అధిక ధరలపై కలెక్టర్ కు రైతుల ఫిర్యాదు 

నంగునూరు, జులై 28: వాతావరణం మార్పులు, లోటు వర్షాకాలం దృష్ట్యా వరి సాగును తగ్గించి, నీటి వసతి తక్కువగా సరిపోయే ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రైతులను కోరారు. మంగళవారం నంగునూరు మండలం నర్మేటలో జరిగిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

ఒక ఎకరం వరి నీటితో ఐదు ఎకరాల ఆరుతడి పంటలు పండించవచ్చని, సెప్టెంబర్లో వర్షాభావం ఉండే అవకాశం ఉన్నందున వరి వైపు వెళ్లి నష్ట పోవద్దని సూచించారు. రైతులు కందులు, పప్పుదినుసులు, మిల్లెట్లు, ఆముదంతో పాటు స్థానికంగా ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పాలమాకుల జడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, నాణ్యత లోపించడంపై వంట సిబ్బంది, హెచ్‌ఎం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామన్ డైట్ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని హెచ్చరించారు.

అధిక ధరలపై రైతుల ఫిర్యాదు 

మండలంలోని ఫెర్టిలైజర్ దుకాణాల్లో డీలర్లు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.దీనిపై వెంటనే స్పందించిన కలెక్టర్..మండల వ్యవసాయ అధికారి  తక్షణమే ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.ఎరువుల విక్రయాల సమయంలో అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.