బెటాలియన్ సిబ్బంది క్రమశిక్షణ, ప్రతిభ అభినందనీయం
కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్, జూలై 28 (విజయక్రాంతి) : బెటాలియన్ సిబ్బంది విధి నిర్వహణతో పాటు క్రీడలు, ఎస్డీఆర్‌ఎఫ్ ప్రాణరక్షణ చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణలో విశేష ప్రతిభ కనబరచడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్ గూడ 2వ తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) బెటాలియన్లో నిర్వహించిన ‘వార్షిక క్రీడా మహోత్సవం2026’ ముగింపు వేడుకలకు సో వారం రాత్రి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.
పోటీల్లో గెలుపోటముల కంటే భాగస్వామ్యమే ముఖ్యమని, నిరంతరం క్రీడల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడి దూరమై పనిలో సమర్థత పెరుగుతుందన్నారు. ఇక్కడి 914 మంది సిబ్బంది చూపే క్రమశిక్షణ వారి పిల్లలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, గతంలో వచ్చిన పతకాల స్ఫూర్తితో రాబోయే రాష్ట్ర స్థాయి క్రీడల్లోనూ మెడల్స్ సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా టెన్నిస్ కోట్ ను ప్రారంభించి అనంతరం వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ బీ వెంకటేశ్వరరెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్లు ఎజెపి నారాయణ, రఘునాథ్ చౌహాన్, శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






