డిసెబులిటీ పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీఓ
ఉట్నూర్, జూలై 28 : ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్లో గల వికాసం డిసెబులిటీ పాఠశాలను మంగళవారం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరందు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న వైకల్యం కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న విద్యా, వసతి, పోషకాహార సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు రోజువారిగా మెనూ వివరాలను సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకొని, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా, ఆహార నాణ్యత ఎలా ఉంది,
విద్యార్థులకు సమతుల్యమైన పోషకాహారం అందుతున్నదా అనే అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమై వారి చదువు స్థాయి, అభ్యాసన సామర్థ్యం, ఉపాధ్యాయులు అనుసరిస్తున్న బోధన విధానాలను పరిశీలించి విద్యార్థుల విద్యా పురోగతిపై ఉపాధ్యాయులతో చర్చించారు. వైకల్యం కలిగిన విద్యార్థులకు అవసరమైన అంగవైకల్య సహాయక పరికరాల వినియోగం, వాటి పనితీరును పరిశీలించారు.
ప్రతి విద్యార్థి సామర్థ్యానికి అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధించాలని, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా విద్యను అందించాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సహాయక సేవలు, సురక్షితమైన, ఆప్యాయతతో కూడిన విద్యా వాతావరణం కల్పించడంతో పాటు వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ప్రభుత్వం గిరిజన, దివ్యాంగ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, విద్యతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, ప్రత్యేక అవసరాలకు అనుగుణమైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా ఉపాధ్యాయులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు.






