24 April, 2026 | 8:22 PM

నిరుపేదల సొంతింటి కల నెరవేరడం ఆనందంగా ఉంది

24-04-2026 06:50 PM

- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా సొంతింటి కల నెరవేరుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వివిధ డివిజన్లలోని 256 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇండ్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎలాంటి దళారి వ్యవస్థ లేకుండా పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు, పింఛన్లు, ఉచిత విద్యుత్తు, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ వంటి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.ఇప్పటివరకు 80 శాతం హామీలను నెరవేర్చామని, మిగిలిన వాటిని కూడా దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు.

ఇంటి స్థలం లేని నిరుపేదలకు జీ ప్లస్ త్రీ విధానంలో ఇండ్లు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని, లబ్ధిదారుల కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాజీపేట డిప్యూటీ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, ఏనుగుల మానస రాంప్రసాద్, జక్కుల రవీందర్ యాదవ్, విజయశ్రీ రజాలి, తదితరులు పాల్గొన్నారు.