27 March, 2026 | 3:27 AM

ఎరువుల కొరతపై రైతుల ఆగ్రహం

27-03-2026 01:40 AM

-అయిల్పామ్ సాగుపై పలు సూచనలు

కోనరావుపేట మార్చి 26 (విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇంచార్జి లచ్చయ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు సంఘ ప్రతినిధులు రైతులతో మాట్లాడుతూ, వరి పంటకు ప్రత్యామ్నాయంగా అయిల్పామ్ వంటి వాణిజ్య పంటలను సాగు చేయాలని సూచించారు.అయిల్పామ్ పంటలో అధిక దిగుబడి, స్థిరమైన ఆదాయం పొందే అవకాశాలపై వారు విపులంగా వివరించారు.పంట మార్పిడి ద్వారా రైతులు లాభాలను పెంచుకోవచ్చని తెలిపారు.

అనంతరం ఎరువుల నిల్వల విషయంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు సమయానికి, సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ దుకాణాల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని అధికారులను ప్రశ్నించారు.ఎరువులు, విత్తనాల సరఫరా, ధరలు అందుబాటు విషయాల్లో పారదర్శకత ఉండాలని రైతులు డిమాండ్ చేశారు.

అలాగే ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఖర్చులు, లాభాల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు.ఈ సమావేశం రైతుల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా, వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలకంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాస్కురి కాశీరం,మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దుర్గరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ మాంధాల లింబయ్య, మేకల ప్రభాకర్ రెడ్డి, ఏఈఓ రమేష్ రైతులు జింక వెంకటి, మాందల శ్రీనివాస్,యాస శ్రీనివాస్, రాసరత్నాకర్ రెడ్డి, కస్తూరి సంజీవరెడ్డి, రణధీర్,రత్నం,రైతులు తదితరులు పాల్గొన్నారు.