18 April, 2026 | 9:23 PM

Breaking News

మాస్టర్ ప్లాన్‌పై మౌనం ఎందుకు?

09-05-2024 02:22 AM

నాడు రద్దు చేయాలని పోరాటాలు

45 రోజుల పాటు కొనసాగిన నిరసనలు 

రద్దు కోసం ఎదురు చూస్తున్న రైతన్నలు

ఎలక్షన్స్ తరువాత రద్దు చేస్తామంటూ హమీలు

కామారెడ్డి, మే8 (విజయక్రాంతి) : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై అధికార పార్టీ నేతలు మౌనం వీడటం లేదు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినా ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తలేరు. గతంలో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కామారెడ్డి పట్టణ పరిధిలోని 8 వీలిన గ్రామాల రైతులు బిక్షాటనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటవార్పు, దిష్టిబొమ్మల దహనాలు చేశారు. కానీ, వారి పోరాటాలకు ఫలితం లేకుండా పోయింది. కామారెడ్డి పట్టణ అభివృద్ధి కోసం పట్టణ ప్రణాళిక ముసాయిదాలో భాగంగా 2041 కామారెడ్డి అభివృద్ధికి గాను మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు కౌన్సిలర్లను కలిసి విన్నవించారు. పచ్చని పొలాలను ఇండస్ట్రియల్, గ్రీన్ జోన్లుగా మాస్టర్ ప్లాన్‌లో పేర్కొనడంతో తమ నోట్లో మట్టి కొట్టవద్దని రైతులు ఆందోళనకు దిగారు. మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తే తమ బతుకులు రోడ్డు పాలవుతాయని పోరాటాలు చేశారు. అప్పట్లో వారికి మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు. అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తున్నట్టు కామారెడ్డి మున్సిపల్ తీర్మానం చేసినప్పటికి ప్రభుత్వం జీవో నుంచి తొలగించకపోవడం తో రైతులు నేటికి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి నెలకొంది. 

పడిపోయిన భూముల ధరలు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రాకతో పట్టణ శివారులోని భూములకు రేట్లు పడిపోయాయి. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు, రాస్తారాకోలు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో రైతులపై పెట్టిన కేసులు నేటికీ ఎత్తివేయకుండా ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చలగాటం ఆడుతున్నాయి. 8 వీలిన గ్రామాలను కలుపుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ 1195 ఎకరాల్లో ఇండస్ట్రీస్ జోన్‌లు ఏర్పాటు చేయగా, రైతన్నలు ఇండస్ట్రీయల్ జోన్ నుంచి తమ వ్యవసాయ భూములను తీసివేయాలని కోరారు. లేకుం టే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని పోరాటం చేశారు. రైతుల పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన నేతలు.. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ రద్దుపై నోరు మెదపడం లేదు. తాము వ్యవసాయం చేసుకుంటున్న భూముల సర్వే నంబర్లను తొలగించాలని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం ఈ మాస్టర్ ప్లాన్ రద్దుపై కిక్కురుమనట్లేదు. 

నాడు ఎన్నికల అస్త్రాలు..

అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దునే ప్రచార అస్త్రాలుగా మార్చుకొని ఓటు అభ్యర్థించారు. అధికారంలోకి వస్తే తక్షణమే మాస్టర్ ప్లాన్ రద్దు చేయిస్తామని హమీలు ఇచ్చారు. ఎన్నికలు పూర్తు ఐదు నెలలు గడుస్తున్నా.. ప్రస్తుతం వారు మాస్టర్‌ప్లాన్‌పై మౌనంవీడటం లేదని రైతులు మండిపడుతున్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా నిర్వహించారు. బీజేపీ నేతలు రఘునందన్ రావు, బండి సంజయ్ లాంటి నేతలు పాల్గొని రైతులను పరామర్శించి అండగా నిలుస్తామని హామీలు ఇచ్చారు. కామారెడ్డి ఎమ్మెల్యే సైతం ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్ రద్దుపై మౌనంగా ఉండటంపై రైతుల్లో చర్చ కొనసాగుతుంది. ఎన్నికల తర్వాత మరోసారి ఉద్యమాన్ని లేవనెత్తేందుకు సిద్ధం అవుతున్నారు.  

భూమి పోతుందన్న బెంగతో రైతు రాములు ఆత్మహత్య  

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు తన భూమి మాస్టర్‌ప్లాన్‌లో పోతుందనే ఆవేదనతో గతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా ప్రభుత్వంలో ఇంతవరకు చలనం లేదు. ఈ విషయమై గతంలో రాములు మృతదేహంతో మున్సిపల్ ముట్టడికి ప్రయత్నం చేయగా 30 యాక్ట్ ఉందని పోలీసులు నిలువరించారు. ప్రతిపక్ష నాయకులు రాములు కుటుంబాన్ని పరామర్శించి, అధికారంలోకి వచ్చాక ఆదుకుంటామని మాట ఇచ్చారు. ప్రస్తుతం మాస్టర్‌ప్లాన్ రద్దుపై మౌనవత్రం పాటిస్తున్నారు.

ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు..?

గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందించగా, ప్రతిపక్ష నాయకులు మా పోరాటానికి అండగా నిలిచారు. తాము అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేస్తామని హామీలు ఇచ్చారు. వారి మాటలు నమ్మి మేము ఓట్లేసి గెలిపించాం. వారు అధికారంలోకి వచ్చి ఐదునెలలు దాటుతుంది. స్థానిక ఎమ్మెల్యేలు మాస్టర్ ప్లాన్ రద్దుపై ఎందుకు మాట్లడట్లేదో వారికే తెలియాలి.

  - తిరుపతి రాజేశ్వర్- రైతు, అడ్లూర్ ఎల్లారెడ్డి