రైతు కొడుకు X కూలీ కొడుకు
* ధన్‌ఖర్, ఖర్గే మధ్య వాగ్వాదం
* రాజ్యసభ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీ, డిసెంబర్ 13: రాజ్యసభలో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌కు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మధ్య మాటల యుద్ధం కొనసాగింది. తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్వీకరించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో చైర్మన్ సీరియస్ అయ్యారు. తాను రైతు బిడ్డను అని, ఎటువంటి బలహీనతను తాను ప్రదర్శించబోనని, ఈ దేశం కోసం ప్రాణాలిస్తానని, ఓ రైతు బిడ్డ ఈ స్థానంలో కూర్చోవడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని చైర్మన్ ధన్‌ఖర్ మండిపడ్డారు.
మీ వెకిలి చేష్టలు అందరికీ తెలుసని, తాను చాలా ఓపిక పట్టానని, రూల్స్ చదువుకోవాలని సూచించారు. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆరోపిస్తూ ప్రతిపక్షాల ఎత్తుగడకు భయపడబోనని అన్నారు. ఈ సమయంలో ఖర్గే కలుగజేసుకోవడంతో ఇద్దరి మధ్య మాటాల తూటాలు పేలాయి. మీరు రైతు బిడ్డ అయితే.. తాను రైతు కూలీ కుమారుడిని అని.. మీకుంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నానని ఖర్గే చెప్పారు. మీరు ప్రతిపక్షాలను అవమానించారని ఆయన మండిపడ్డారు.మీరు చేసే ప్రశంసలు వినడానికి తాము సభకు రాలేదని, చర్చ కోసం వచ్చామని ఖర్గే అన్నారు. దీంతో చైర్మన్ ధన్‌ఖర్ కలుగజేసుకుంటూ మీరు ఎటువంటి ప్రశంసలు వినాలనుకుంటున్నారో తనకు తెలుసని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో సభ సోమవారానికి వాయిదా పడింది.






