నీ తల్లిదండ్రులను చంపేయడమే మంచిది
* యువకుడికి సలహా ఇచ్చిన ఏఐ చాట్‌బాట్
* స్క్రీన్ టైమ్‌పై పరిమితి పెట్టడమే కారణం
* క్యారెక్టర్.ఐపై దావా వేసిన కుటుంబం
టెక్సాస్, డిసెంబర్ 13: మన జీవితంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను అడ్డూఅదుపు లేకుండా వాడితే ఏర్పడే విపరీత పరిణామాలపై నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈక్రమంలో తన ఫోన్ స్క్రీన్ టైమ్ వినియోగాన్ని పరిమితం చేసిన తల్లిదండ్రులను చంపేయడమే మంచిదిని ఓ యువకుడి(17)కి ఏఐ చాట్‌బాట్ సలహా ఇచ్చింది. దీంతో ఏఐ ప్లాట్‌ఫామ్ క్యారెక్టర్.ఐపై ఆ కుటుంబం దావా వేసింది.ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. పిల్లలకు క్యారెక్టర్.ఐ ప్రత్యక్షంగా మరింత ముప్పును కలిగిస్తుందని ఆ కుటుంబం ఆరోపించింది. ప్లాట్‌ఫామ్‌లో తగిన భద్రత లేకపోవడంతో పేరెంట్స్, వారి పిల్లల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని వాదించింది. అవసరమైన చర్యలు తీసుకునే వరకు ప్లాట్‌ఫామ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని కోరింది. క్యారెక్టర్.ఐ ప్లాట్‌ఫామ్ కారణంగా మైనర్లలో నిరాశ, ఆందోళన, హింసాత్మక ధోరణులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. చర్యలు చేపట్టి మరిన్ని ప్రమాదాలు జరుగకుండా చూడాలని కోరారు. క్యారెక్టర్.ఐతో పాటు గూగుల్‌ను కూడా దావా లో చేర్చారు. ఏఐ ఆధారిత క్యారెక్టర్.ఐని 202 1లోగూగుల్ మాజీ ఇంజినీర్లు స్థాపించారు.






