18 July, 2026 | 6:55 AM

న్యాయమూర్తులు ఫేస్‌బుక్‌ను వాడొద్దు

14-12-2024 01:04 AM

* న్యాయవ్యవస్థలో ఆడంబరానికి చోటు లేదు

* సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: న్యాయమూర్తులు ఫేస్‌బుక్‌ను వాడకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తులు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలని పేర్కొన్నది. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, న్యాయ పరమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని కోరింది. సా ధ్యమైనంత వరకు సన్యాసుల వలె జీవించి గుర్రాల మాదిరిగా పనిచేయాలని సూచించింది. ప్రొబేషన్ పీరియడ్‌లో సంతృ ప్తికరంగా పనిచేయలేదని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇద్దరు మహిళా జ్యుడీషి యల్  అధికారుల( అదితికుమార్ శర్మ, సరితాచౌదరి)ను తొలగించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. అలాగే న్యాయవ్యవస్థలో ఆడంబరానికి చోటులేదని స్పష్టం చేసింది.

ఏదైనా ఓ కేసులో తీర్పును ఇస్తే.. ఆ కేసులో ఆ న్యాయమూర్తి ఇప్పటికే సోషల్ మీడియాలో మరో కోణంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ధర్మాసనం పేర్కొన్నట్లు పీటీఐ పేర్కొన్నది. ఈ ఏడాది ఆరంభంలో ఆరుగురు మహిళా సివిల్ జడ్జీలను మధ్యప్రదేశ్ హైకోర్టులో తొలగించారు. అయితే వీరిలో నలుగురిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మిగితా ఇద్దరిని మాత్రం విధుల్లోకి తిరిగి తీసుకోలేదు.ఈ క్రమంలో తొలగించబడిన న్యాయమూర్తుల్లో ఒకరు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.  ఈ కేసు విచారణ సందర్భం గా న్యాయమూర్తులు సోషల్ మీడియాను వాడడంపై సుప్రీం ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టుతో పాటు ఇతర వాటాదారులకు నోటీసులు జారీ చేసింది.