18 May, 2026 | 3:04 AM

రాజీవ్ రహదారిపై బైఠాయించిన రైతులు

18-05-2026 02:03 AM

పోద్దుతిరుగుడు కొనడం లేదంటూ ఆందోళన, స్తంభించిన ట్రాఫిక్ 

సిద్దిపేట, మే 17 (విజయక్రాంతి): పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరిగోశ పెడుతున్నట్లు సర్పంచు తిరుపతిరెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రాముని పట్ల రాజీవ్ రహదారిపై ఆదివారం రైతులు బైఠాయించి ఆందోళన చేశారు.

అల్లిపూర్ సొసైటీ కార్యాలయం ముందు ఉన్న సన్ఫ్లవర్ ధాన్యం కొనుగోలు చేయాలని  డిమాండ్ చేశారు. 45 రోజుల నుంచి సొసైటీ ఆవరణంలో ధాన్యం పోసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. మండుటెండల్లో రాజీవ్ రహదారిపై కూర్చున్న పట్టించుకునే నాథుడు లేదని రైతులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ తమకు ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని రైతులు ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ధాన్యం కింద మొత్తం చెదలు పట్టి పెట్టుబడి కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతున్నట్లు తెలిపారు. రైతుల గోస ఎవరికి పట్టడం లేదని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వినయ్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.