23 July, 2026 | 12:37 AM

నమ్మించి వల వేశాడు..

23-07-2026 12:00 AM

కడియాల కోసం రాళ్లతో దడిసి కొట్టాడు

చేవెళ్ల, జూలై 22 (విజయక్రాంతి): నమ్మిన వ్యక్తే కాలయముడై మారిన ఘోర సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వివాహితను నమ్మించి తీసుకెళ్లి, మద్యం తాపించి ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకెళ్లాడొక కిరాతకుడు. ఘటనకు సంబం ధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఊరెళ్ల గ్రామానికి చెందిన సుగుణమ్మ (40) చేవెళ్ల పట్టణంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో హౌస్ కీపింగ్గా పనిచేస్తోంది. సోమవారం విధులు ముగించుకుని వస్తుండగా, పరిచయస్తుడైన ఒక వ్యక్తి ఆమెను ’బంగారు మైసమ్మ’ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు మద్యం తాపడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది.

ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకున్న దుండగుడు, కాళ్లకు ఉన్న కడియాలు రావడం లేదని రాళ్లతో మోదడం ప్రారంభించాడు. దీంతో తీవ్ర గాయాలై ఆమె కేకలు వేయడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. మంగళవారం ధర్మసాగర్ సమీపంలో తీవ్ర గాయాలు, చిరిగిన దుస్తులతో కనిపించిన సుగుణమ్మను కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెపై చోరీతో పాటు అత్యాచారం కూడా జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు.