16-12-2025 02:21:50 AM
ప్రతిభను ఆవిష్కరించిన రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ మెగా ఫండ్ రైజర్
హైదరాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్, దేవ్నార్ ఫౌండేషన్ ఫర్ ద బ్లైండ్ సహకారంతో నిర్వహించిన ఫండ్‌రైజింగ్, మెగా డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఆదివారం సాయంత్రం నోవోటెల్, హైటెక్ సిటీ, హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం చివరగా నిర్వహించిన అంధ బాలల ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ భావోద్వేగపూరితంగా సాగి, అంధులు, ఆటిజం పిల్లలలో ఉన్న అపారమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని సమాజానికి చాటిచెప్పింది.
విధాన రూపకర్తలు, సామాజిక నేతలు, కార్పొరేట్ ప్రతినిధులు, సినీ ప్రముఖులతో నిండిన సభ నుంచి నిలబడి చప్పట్లతో ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రతిభ కలిగిన పిల్లలను సాధికారత దిశగా నడిపిస్తూ సమాజాన్ని ప్రేరేపిస్తున్న రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుషార్ సావ్లాని మాట్లాడుతూ.. ప్రతి పిల్లవాడికి గౌరవం, అవకాశాలు, మెరవడానికి వేదిక ఉండాలి.
ఈ రోజు జరిగిన ర్యాంప్ వాక్ ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు ఇది ఆత్మవిశ్వాసం అన్నారు. ఈ ఫండ్‌రైజర్‌కు రాజకీయ నేతలు, కార్పొరేట్ అధినేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ, టెలివిజన్ రంగ ప్రముఖులు వంద మందికి పైగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సామాజిక సేవ, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందజేశారు. కాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రైజింగ్ గ్లోబల్ ఫౌండేషన్, విద్య, ఆరోగ్యం, సామాజిక సంక్షేమ రంగాల్లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోంది.