ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ
- కాట్నపల్లి నిందితుడికి శిక్ష పడేలా చేస్తాం
- బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
- చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్‌లో ఉద్యోగం కల్పిస్తాం
- మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క
పెద్దపల్లి/మంథని, జూన్ 16 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లిలో జరిగిన హత్యాచార ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూస్తామని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఆదివారం కాట్నపల్లిలో చిన్నారి కుటుంబాన్ని పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కన్‌సింగ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రులను ఓదార్చి, మనోధైర్యం కల్పించారు. చిన్నారిపై అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
రామగుండం సీపీ శ్రీనివాస్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తమను కలిచివేసిందని, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గం, ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు తెలిపారు. చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్‌లో ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి అండగా నిలిచేందకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని కోరారు. సీఎం రెవంత్‌రెడ్డి అదేశాలతో చిన్నారి కుటుంబానికి రూ.రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రైస్‌మిల్లు యాజమాన్యం రూ.ఐదున్నర లక్షల పరిహారం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రత, నిఘా పెంపు వంటి చర్యలు తీసుకుంటామన్నారు.
200 రైస్ మిల్లులపై నిఘా
ఒక్క సుల్తాన్‌బాద్ పాంత్రంలోనే దాదాపు రెండు వందల రైస్ మిల్లులు ఉన్నాయని మంత్రులు అన్నారు. ఆ మిల్లుల్లో పనిచేసేందుకు ఒరిస్సా, బీహర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కార్మికులు ధాన్యం కొనుగోలు సమయంలో వస్తారని చెప్పారు. ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే కాదు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి కూలీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకొని ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. వారివెంట రామగుండం సీపీ శ్రీనివాస్‌లు, డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ తదితరులు ఉన్నారు.
కామాంధుడిని కఠినంగా శిక్షించాలి
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 16 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో ఆరేళ్ల బాలికను హత్యాచారం చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొడుదుల వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో మహి ళలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలికపై అత్యాచారాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాలన్నారు. కామాంధులను కఠినంగా శిక్షించే చట్టాలను ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.






