24 July, 2026 | 2:47 AM

నీట్ లీక్ విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు

24-07-2026 01:55 AM

నిందితులను కఠినంగా శిక్షిస్తాం

యువత భవిష్యత్తే మాకు ముఖ్యం

హాని తలపెట్టేవారిని వదిలిపెట్టబోం

‘ఎక్స్’లో ప్రధాని మోదీ 

న్యూఢిల్లీ, జూలై 23: నీట్ పేపర్ లీక్ కేసుల్లో దోషులను త్వరితగతిన శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘మన యువ త భవిష్యతే మాకు ముఖ్యమని, హాని తలపెట్టేవారిని వదిలిపెట్టబోం’ అని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ‘ఎక్స్’లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.

యువత భవిష్యత్తుతో ఆడుకునే ఎవ్వరినైనా ఉపేక్షించేది లేదని తన ప్రకటనతో ప్రధాని మోదీ, లీకేజీ మాఫియాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. నీట్ పేపర్ లీక్‌ల ఘటనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలని ఒకపక్క ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఉద్యమం ఉధృతం అవుతుండడం, మరోపక్క పార్లమెంట్‌లో వాయిదాల పర్వం కొనసాగడం, దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న తరుణంలో ప్రధాని మోదీ ప్రకటన చేయడం గమనార్హం.

దేశంలో ఇటీవల నీట్ సహా వివిధ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల పేపర్ లీకేజీ వ్యవహారాలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు, వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, లీకేజీ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ‘దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. పేపర్ లీక్ కేసుల్లో నిందితులకు త్వరితగతిన, అత్యంత కఠినమైన శిక్షలు పడేలా చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

ఈ మేరకు సంబంధిత శాఖలు, అధికారులకు తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం’ అని మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో, వారి కష్టంతో ఆడుకునే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడటానికి ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు ఒక మైలురాయి అని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకుసాగుతోంది. ప్రధాని మోదీ ప్రకటనపై దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు, యువజన సంఘాలు, వారి తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తోంది.