06-09-2025 02:09:34 PM
హైదరాబాద్: కవిత చేసిన(Kavitha comments) వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిదన్నారు. గత కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసిందే అన్న ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు ఎరువులు దొరకక రైతులు గోస పడుతుంటే, మరోవైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని సూచించారు.
కేసీఆర్ కాలంలో ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy Sarkar) ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్కటిగా కూల్చే ప్రయత్నం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజల్ని ఆదుకోవడం మా కర్తవ్యం అన్నారు. ద్రోహుల చేతుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంపైనే మా దృష్టి అంతా ఉంటుందని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీని అధికారంలోకి తెచ్చుకొని, ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని హరీశ్ రావు స్పష్టం చేశారు.