2 March, 2026 | 8:41 AM

తండ్రి అంత్యక్రియలకు ఇన్నయ్య

02-03-2026 01:49 AM
  1. కండీషన్ బెయిల్‌పై సాగరం గ్రామానికి గాదె ఇన్నయ్య
  2. ఇన్నయ్యపై ప్రభుత్వాల కక్షసాధింపు చర్యలు
  3. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి 

మహబూబాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): సామాజికవేత్త, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య తండ్రి సాల్మాన్‌రెడ్డి అనారోగ్యంతో శనివారం జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం సాగరం గ్రామంలో తుదిశ్వాస విడిచారు. దివంగతుడైన తండ్రి కడసారి చూపు కోసం, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇన్నయ్య కండిషన్ బెయిల్ పై విడుదలై ఆదివారం సాగరం చేరుకున్నారు.

మావోయిస్టు భావజాల వ్యాప్తికి పాల్పడుతున్నాడన్న అభియోగంపై ఇన్నయ్యను ఎన్‌ఐఏ పోలీసులు రెండు నెలల క్రితం అరెస్టు చేశారు. ఈ క్రమంలో తల్లి థెరిస మ్మ నెలన్నర క్రితం మరణించిన సమయంలో కూడా ఇన్నయ్య ప్రత్యేక బెయిల్ పై వచ్చారు. మళ్లీ తండ్రి మరణంతో ఆదివారం బెయిల్ పై రావడంతో గ్రామం లో తీవ్రవిషాదం నెలకొంది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అనాథ పిల్లల సంరక్షకుడిగా ‘మా ఇల్లు ఆశ్రమం’ నిర్వహిస్తున్న గాదె ఇన్నయ్య పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. వెన్నునొప్పి, ఒక చేయి లేకుండా తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఇన్నయ్యను కుట్ర చేస్తున్నారని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడం సరైనది కాదని సూచించారు.

ఆదివారం రాజేశ్వర్‌రెడ్డి ఇన్నయ్యను పరామర్శించి, సాల్మన్‌రెడ్డి భౌతికకాయంపై పుష్పగు చ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఇన్నయ్యపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, ఇన్నయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇన్నయ్య తండ్రి సాల్మాన్‌రెడ్డి భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.