calender_icon.png 7 September, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు కన్నబిడ్డలను కాల్చి చంపి, తండ్రి ఆత్మహత్య

04-09-2025 04:39:37 PM

కల్వకుర్తి రూరల్: కన్నప్రేమకు మచ్చతెచ్చేలా, మానవత్వం సిగ్గుపడేలా నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool District)లో అత్యంత దారుణమైన, హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే తన ముగ్గురు పసిపిల్లలను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా సజీవదహనం చేసి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు రోజులుగా కొనసాగుతున్న తండ్రి, ముగ్గురు పిల్లల అదృశ్యం కేసు విషాదాంతంగా ముగియడం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వెల్దండ మండలం పెద్దాపూర్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తులో భాగంగా వెంకటేశ్వర్లు ముగ్గురు పిల్లలు అదృశ్యమైనట్లు గుర్తించారు. దీంతో పిల్లల మిస్సింగ్ మిస్టరీని చేధించేందుకు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్(District SP Gaikwad Vaibhav Raghunath) ప్రత్యేక టీం ఏర్పాటు చేసి డ్రోన్, జాగిలాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో పోలీసులకు ఒళ్లు గగుర్పొడిచే నిజాలు తెలిశాయి. ఉప్పునుంతల మండలం సూర్య తండా సమీపంలోని శివారు ప్రాంతంలో ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. వారిని వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె వర్షిణి, కుమారుడు శివగా నిర్ధారించారు. కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామ సమీపంలో పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహాన్ని వెల్దండ పోలీసులు కనుగొన్నారు. ముగ్గురు పిల్లలనూ తండ్రే పెట్రోల్ పోసి నిప్పంటించి చంపినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దారుణంలో పిల్లల శరీరాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని విధంగా మాంసం ముద్దలుగా మారిన దృశ్యాలు చూపరుల హృదయాలను కలచివేశాయి. సంఘటనా స్థలాలకు చేరుకున్న అచ్చంపేట, వెల్దండ పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలా లేక మరేదైనా కారణమా అనే దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఒకే కుటుంబంలో తండ్రితో సహా నలుగురు మృతి చెందడం, అందులో ముగ్గురు పసిపిల్లలు అత్యంత కిరాతకంగా హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.