06-12-2024 01:48:13 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 5 (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం(కేఏఎంఎస్) సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ నాయకురాలు మడివి మంగ్లీ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె వివరాలను ఎస్పీ రోహత్‌రాజు వెల్లడించారు. చతీస్‌గఢ్ రాష్ట్రం భీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టగూడెం గ్రామానికి చెందిన మంగ్లీ 2003లో పామేడు ఎల్‌వోఎస్ కమాండర్ సుక్కు ప్రోత్సాహంతో మావోయిస్టు పార్టీ సీఎన్‌ఎం(చైతన్య నాట్య మండలి)లో చేరారు.
2004 వరకు అక్కడ పనిచేసి 2004 నుంచి 2007 వరకు కిష్టారం ఏసీలో సావిత్ర డీవీసీఎంతో పార్టీలో పనిచేశారు. 2007లో మంగ్లీకి పార్టీ కమాండర్ కరటం రాజేష్‌తో వివాహం జరిగింది. 2008లో 8వ ప్లాటూన్ కిష్టారం ఏసీకి బదిలీ అయ్యి, కమాండర్ నరేష్ ఆధ్వర్యంలో పనిచేశారు. 2009లో ఏసీఎం క్యాడర్‌గా ఎదిగి 2015 వరకు పనిచేశారు. 2022లో మంగ్లీని కేఏఎంఎస్ ఇన్‌చార్జ్‌గా నియమించారు. లొంగిపోయే వరకు ఆ బాధ్యతలను నిర్వహించినట్టు ఎస్పీ వివరించారు. 2007లో ఇంజర గ్రామం వద్ద భద్రత బలగాలపై జరిపిన పేలుడు ఘటన లో మంగ్లీ పాల్గొన్నట్టు తెలిపారు.