01-01-2026 02:00:41 PM
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంగా మాట్లాడుతూ.. క్యాలెండర్లు మారినప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాలు మరింత దిగజారాయన్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ నాటి కష్టాలు మళ్లీ తలెత్తుతుండటంతో రాష్ట్రం తిరోగమనంలోకి జారుకుంటోందన్నారు. రైతులు, గిరిజనులు, పర్యావరణం, విద్యార్థుల సమస్యలపై పోరాటస్ఫూర్తితో నిరసనలు చేపట్టిన పార్టీ కార్యకర్తలను కేటీఆర్ ప్రశంసించారు.
గెలుపు ఓటములు తాత్కాలికమని, కానీ ప్రజల హృదయాలలో కేసీఆర్‌కు ఉన్న స్థానం శాశ్వతమన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం ప్రారంభమైందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) స్పష్టం చేశారు. యూరియా కోసం రైతులు చలికి వణుకుతూ క్యూలైన్లో ఉన్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రెండు పార్టీలు ఒక్కటై మనపై కత్తులు దూస్తున్నాయని కేటీఆర్ వివరించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతవరకు మనల్ని ఎవరూ ఏం చేయలేరని ఆయన వెల్లడించారు. 2028లో పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడమే తమ పార్టీ ఏకైక లక్ష్యమని కేటీ రామారావు(KT Rama Rao) అన్నారు.
కాంగ్రెస్, బీజేపీల సంయుక్త దాడిని ఎదుర్కొంటున్నప్పటికీ, కార్యకర్తలు ఏకాగ్రతతో ఉండాలని, తాత్కాలిక ఎదురుదెబ్బలతో నిరుత్సాహపడకూడదని కోరారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని, అదే సమయంలో 2026లో సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తుందని ప్రకటించారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న, నీతి, న్యాయం, నిజాయితీని తన పక్షాన కలిగిన బీఆర్ఎస్ పార్టీకి విజయం తథ్యమని కేటీఆర్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.