06-12-2024 01:47:48 AM
ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత నాది
* మేం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మారీచులు, సుబాహుల్లా, రాహుకేతువుల్లా అడ్డుపడుతున్నారు. కేసీఆర్.. మీ పిల్లలిద్దరినీ మాపైకి ఉసిగొల్పి ఎందుకిలా చేస్తున్నారు. ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు. శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదు.
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ‘ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారు.. మేం ఇళ్లు కట్టిస్తాం.. ఇంటిలో యువతులు ఉంటే పెళ్లి చేసుకోవాలి’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘రోటి కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం.. ఇల్లు, వ్యవసాయం, భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు.
అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇల్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించారు. ఏ గ్రామానికి పోయినా గుడి లేకపోవచ్చు.. కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఉండదు. ఇందిరమ్మ ప్రజా పాలనలో సొంతింటి కలతో పేదలు ఆత్మగౌరవంగా బతకాలనే ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది’ అని సీఎం పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ‘మొబైల్ యాప్’ ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర గృహనిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.10 వేల వ్యయంతో ప్రారంభ మైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నాటికి రూ.1.25 లక్షలకు చేరిందని, ఇప్పుడు రూ. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల వరకు ప్రతి పేదవాడికి ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు.
అత్యంత పేదవారికి, అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలన్నదే తమ ధ్యేయమని, దళితులు, గిరిజనులు, పారిశుద్ధ్య కార్మికులు, వికలాం గులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్స్‌కు ఇళ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యం ఉంటుం దన్నారు.
అందుకు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో మొత్తం 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకుని, పరిపాలన అనుమతులు ఇచ్చామని సీఎం వివరించారు. ప్రభుత్వానికి సంక్షే మం, అభివృద్ధి రెండు కళ్లు అని, ఈ రెండింటిని అమలు చేసుకుంటూ ప్రభుత్వం ముం దుకెళ్లుతోందని తెలిపారు.
తాము ఎన్నికల ముందు చెప్పిందే చేసి చూపించామని ముఖ్యమంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇచ్చే భాద్యత తనదేనన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగకుండా ఏఐ విధానాన్ని అనుసరిస్తామని, బిల్లులు చెల్లింపులో ఎవరికి కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా గ్రీన్ ఛానల్ ద్వారానే నాలుగు పర్యాయాలు నిర్మాణం ఖర్చులు చెల్లిస్తామన్నారు. ప్రతి మండలంలో ఒక మోడల్ హౌస్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.
బెల్ట్ షాపులే ఎక్కువగా దర్శనమిచ్చాయి
బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన ఇళ్లను మధ్యలో వదిలేసిన వాటికి కూడా తమ ప్రభుత్వం రూ. 195 కోట్ల నిధులు కేటాయించడంతోపాటు బ్యాంకు రుణాలను కూడా చెల్లించి రుణవిముక్తులను చేశామన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ందని, ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో కేవలం 1.52 లక్షల ఇళ్లు నిర్మించారని, అందులో 65 వేల ఇళ్లనే పూర్తిచేశారని తెలిపారు.
9 నెలల్లో ప్రగతిభవన్, ఆ తర్వాత సచివాలయం, వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లతోపాటు 33 జిల్లాల్లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్న కేసీఆర్, పేదలకిచ్చిన డబుల్‌బెడ్ రూం ఇళ్లను మాత్రం పూర్తిచేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను పిట్టగూళ్లని, కొడుకు, కోడలు..
బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడుంటారని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కేసీఆర్.. తన పదేళ్లలో డబుల్‌బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి కేవలం 65 వేల ఇళ్లను మాత్రమే నిర్మించారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి కంటే బెల్ట్‌షాపులే ఎక్కువగా దర్శనమిచ్చాయని, అందుకు ఆ ప్రభుత్వం ప్రోత్సహించిందని సీఎం ఆరోపించారు.
కేసీఆర్ సర్కార్ చేసిన రూ. 7లక్షల కోట్ల అప్పులకు అసలు, వడ్డీ కలిపి నెలకు రూ. 6,500 కోట్లు చెల్లిస్తున్నామని, అప్పు లు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి కల్పించారని సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను పక్కన పెడితే.. అప్పులు మోయలేక నడుములు పోతున్నాయన్నారు.
ఆదివాసీ, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక కోటా..
ఐటీడీఏ ప్రాంతాల పరిధిలోని ఆదివాసీలు, చెంచులు, గోండు, ఇతర గిరిజన వర్గాలకు ఇందిర్మ ఇళ్ల పథకంలో ప్రత్యేక కోటాను అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివాసీ, గోండులు దేశానికి మూల పురుషులని, ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండానే అర్హులైన వారిని ఎంపిక చేస్తామని తెలిపారు.
ఆదివాసీలకు కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చిన ఇళ్లు ఉన్నాయని, గత పదేళ్ల బీఆర్‌ఎస్ సర్కార్ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సమయంలో ఆదివాసీలు తమను కలిసి ఎన్నో సమస్యలను చెప్పుకున్నారని సీఎం పేర్కొన్నారు.
మీ పిల్లలను మా మీదకు ఉసిగొల్పడం మంచిది కాదు.
ఇప్పటికైనా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీ విధానమేంటి..? ఆలోచనేంటి..?ఈ ప్రభుత్వమే నడవొద్దా..? ప్రజలకు సంశ్రీక్షేమం చేపట్టవద్దా..? రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా..? మీరు సభకే రావడం లేదు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆర్థం చేసుకోవాలి..? మీ అనుభవం, చతురతను ఉపయోగించి పాలక పక్షానికి సూచనలు చేయండి.
ఏ సూచన చేయకుండా అడ్డుకుంటామనే విధానంలో ఉండటం తెలంగాణకు మంచిదా..? పార్టీ నేతలు తెలియక ఏదైనా అన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదని చెప్పాలి కదా..? మీ పిల్లలిద్దరినీ మాపైకి ఉసిగొల్పి ఎందుకిలా చేస్తున్నారు. ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు’ అని కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
క్లాస్ రూమ్‌లో హోం వర్క్ చేయని పిల్లలు, హోం వర్కు చేసిన వాడి పుస్తకాన్ని చించేసినట్లు, ఆట బొమ్మలను విరగొట్టే చిన్న పిల్లల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావాలని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
కేసీఆర్, కిషన్‌రెడ్డి, బండికి ఆహ్వానం
ఈనెల 7,8,9 తేదీల్లో ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలి పారు. సచివాలయం, నెక్లెస్‌రోడ్డులో వేడుకలు నిర్వహిస్తామని, డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఈ ఉత్సవాలకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తుందని తెలిపారు.
వీరికి ఆహ్వాన పత్రాలు అంద జేసేందుకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొటోకాల్ అధికారులు వెళ్తారని చెప్పారు. తమిళనాడు స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆ రాష్ట్రంలో నాయకులు, పార్టీల మధ్య ఎన్ని విభేదాలున్నా.. రాష్ట్ర సమస్య వచ్చేసరికి ఎంపీలం దరు ఏకమై కేంద్రంపై పోరాటం చేస్తారని తెలిపారు.
ఇక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ఏకమవ్వాలని, అది మంచి సంప్రదాయమన్నారు. అయితే తాము చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు మారీచు, సుబాహుల్లా, రాహుకేతువుల్లా అడ్డుపడుతున్నారని సీఎం మండిపడ్డారు.
పాలన సాగింది ఆరు నెలలే..
ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా.. పాలన చేసింది మాత్రం ఆరు నెలలేనని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కొత్తగా పెళ్లయిన వారికి ఆషాడం వచ్చినట్లుగా తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఐదునెలల పాటు సచివాలయానికి రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఐదేళ్లు ప్రజలు సమయమిచ్చారని, ఇంకా తమకు నాలుగేళ్ల సమయం ఉందన్నారు. ఒక్కో హామీని అమలు చేసుకుంటూ ముందుకెళ్లుతున్నట్లు చెప్పారు.
ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం మంచిది కాదు..
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. శాసనసభలో ప్రధా న ప్రతిపక్ష నేత సీటు ఖాళీగా ఉండటం రాష్ట్రానికి మంచిది కాదని, అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వం తప్పు లు చేస్తే ప్రశ్నించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
ప్రభుత్వం అంటే కాంగ్రె స్ పార్టీకి చెందిన 65 మంది ఎమ్మెల్యేలే కాదని, సభలోని 119 మంది ఎమ్మెల్యేలు అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అధికార, విపక్షాలు అంటే భారత్ తరహాలో పరిస్థితిని ఎందుకు మార్చారని సీఎం ప్రశ్నించారు. ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా సమస్యలను ఒక్కొక్కటికి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లుతున్నామని, దీనికి ప్రతిపక్షాలు కొంత సమయం ఇచ్చి సహకరించాలన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజా సమస్యలపై రిప్రజెంటేషన్ ఇచ్చి చర్చించేవారని, ఆ తర్వాత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా అదే తరహాలో ప్రభుత్వానికి సూచనలు చేసేవారని, లోపాలను సరిదిద్దుకోవాలని చెప్పేవారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
‘ఉమ్మడి రాష్ట్రంలో మంచి సంప్రదాయం ఉండేది, సభలో కొన్ని అంశా లను చర్చించి.. ఆ తరవాత ప్రజల సమస్యలపై అప్పటి మంత్రులను కలిసి నిధులు రాబట్టుకునే వాళ్లం. హరీశ్‌రావు కూడా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని కలిసి నిధులు తీసుకెళ్లారు. నేను కూడా ఎమ్మెల్యేగా కొడంగల్‌కు వందల కోట్ల రూపాయలు తీసుకుని అభివృద్ధి చేసుకున్నాను.
కానీ గత పదేళ్లు అప్పటి సీఎం కేసీఆర్ ఆ అవకాశం కల్పించలేదు. సచివాలయానికి రాలేదు. అయి నా పదేళ్లు మీరు ఏమి చేశారని మేం అడగటం లేదు. ప్రజలు అవన్నీ గమనించి బీఆర్‌ఎస్‌ను అధికారానికి దూరం చేశారు’ అని చెప్పారు.