ట్రై-కార్పొరేషన్లకు నిధులేవీ?
- 9,700 కోట్లు అడిగితే మొండిచేయి చూపిన ప్రభుత్వం
- బడ్జెట్‌లో దక్కని ప్రత్యక్ష ప్రాధాన్యం
- ఏప్రిల్ నుంచి కొత్త కార్పొరేషన్లకు జీతాల కష్టాలు!
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ లక్ష్యాలను ప్రకటించినా.. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి ఆర్థిక మనుగడను మాత్రం విస్మరించింది. పురపాలక శాఖకు మొత్తం రూ.17,907 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, అందులో ట్రై-కార్పొరేషన్లకు నేరు గా నిధులు కేటాయించకుండా కేవలం ప్రాజెక్టులకే పరిమితం చేసింది.
నగర పునర్విభ జన తర్వాత అభివృద్ధి పనుల కోసం మున్సిపల్ అధికారులు సుమారు రూ.9,700 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు పం పారు. ఇందులో జీహెచ్‌ఎంసీకి రూ.5 వేల కోట్లు, సైబరాబాద్ మల్కాజిగిరి కార్పొరేషన్లకు కలిపి మరో రూ.4,700 కోట్లు ఉండాలని కోరారు. అయితే, బడ్జెట్‌లో ఈ మూడు కార్పొరేషన్ల పేర్లను కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులకు మాత్రమే రూ.2,654 కోట్లు విదిలించి చేతులు దులుపుకుంది.
ఏప్రిల్ నుంచి జీతాల తిప్పలు..
గత నెల 11న మూడు కార్పొరేషన్లుగా విభజన జరిగినా, ఇప్పటివరకు ఆర్థిక లావాదేవీల న్నీ పాత జీహెచ్‌ఎంసీ అకౌంట్ నుంచే సాగుతున్నాయి. సిబ్బంది జీతభత్యాలను కూడా జీహెచ్‌ఎంసీయే భరిస్తోంది. ఏప్రిల్ నుంచి కొత్త బ్యాంక్ ఖాతాలు తెరిచి ఆదా యం, అప్పుల పంపకాలు జరిపిన తర్వాత ఈ మూ డు కార్పొరేషన్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఏ ప్రిల్‌లో ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా వచ్చే ఆస్తిపన్నుతో ప్రస్తుతానికి నెట్టుకొచ్చినా, భవిష్యత్తు లో రోజువారీ నిర్వహణ భారంగా మారనుంది.
హైడ్రాకు రూ.234 కోట్లు..
చెరువులు, నాలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పడిన హైడ్రాకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.20 కోట్లు ఉన్న కేటాయింపులను, ఈ సారి ఏకంగా రూ.234.27 కోట్లకు పెంచిం ది. ఇందులో పట్టణ అభివృద్ధి కింద రూ.111 కోట్లు, స్థానిక సంస్థలకు ఆర్థిక సాయం కింద మరో రూ.111 కోట్లు, కార్యాలయ నిర్వహణకు రూ.11.31 కోట్లు కేటాయించింది.
మెట్రోకు 1,100 కోట్లు
నగర ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో రైల్‌కు ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించింది. ఇందులో పాతబస్తీ కారిడార్ ఎయిర్‌పోర్టు మెట్రో ఫేజ్ 2 పనులకే రూ. 600 కోట్లు కేటాయించింది. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు మంజూ రు చేసింది. నగర ప్రజల దాహార్తి తీర్చే సుంకిశాల ప్రాజెక్టు కోసం రూ. వెయ్యి కోట్ల రుణాల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అప్పులే దిక్కు?..
బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే ప్రభు త్వం నేరుగా నిధులు ఇవ్వడం కంటే అప్పు లు తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. జలమండలికి రూ.2 వేల కోట్లు, హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.వెయ్యి కోట్లను రుణాల రూపంలో సమీకరించుకోవాలని సూచించింది. దీనివల్ల సంస్థలపై వడ్డీ భారం పెరిగి, భవిష్యత్తులో పౌర సేవలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




