ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం
మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): డీలర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ఎరువులు, పెస్టిసైడ్స్, విత్తనాల దుకాణాలు బంద్ నిర్వహించారు. జాతీయ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు తెలిపారు.
వరంగల్ జిల్లా అసోసియేషన్ భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎరువుల కంపెనీలు అన్ని ఫ్రాయిట్ ఆన్ లొకేషన్ (ఎఫ్‌ఓఎల్) విధానం అమలు పరిచి అలాగే యూరియా, కాంప్లెక్స్ ఎరువుల పై లింక్ ప్రొడకట్స్ ను అంటగట్టి, బలవంతపు విక్రయం, హెచ్టి, బీటీ కాటన్, ఎక్స్పైరీ స్టాక్స్ వంటి సమస్యలు డీలర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. డీలర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బంద్ నిర్వహించడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు.
ఎరువుల కంపెనీలు అన్నీ కూడా ఎఫ్‌ఓఎల్ ఇవ్వకుండా డీలర్లను మోసం చేస్తున్నాయన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విచ్చలవిడిగా లైసెన్స్ ఇవ్వకుండాచూడాలన్నారు. బినామీ పేర్లతో ఉన్నటువంటి లైసెన్స్ లు రద్దు చేయాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన పెంపొందించాలని, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు, అదే విధంగా కంపెనీలకు మాత్రమే లైసెన్స్ ఇవ్వాలనేటువంటిది తమ ప్రధానమైనటువంటి డిమాండ్ అన్నారు. డీలర్స్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర ముఖ్య మంత్రి, వ్యవసాయశాఖ మంత్రిని కలిసి డీలర్ల సమస్యలపై వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గౌరీశెట్టి నాగరాజు, రాజేందర్ రెడ్డి, రాంచంద్ర రెడ్డి, గుర్రం మధు సుదన్ రావు, జిల్లా నాయకులు ప్రవీణ్, పరమేశ్వర్, హరిందర్, రాజేశ్వర్ రావు, రాజేంద్ర యాదవ్, యాదగిరి, జగన్, సంపత్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఎలందర్ రెడ్డి,వెంకన్న, పైడి, ఆనందం తో పాటు అనేకమంది డీలర్ లు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎరువుల డీలర్లు షాపులు బందు చేసి నిరసన తెలిపారు. మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి తహాసిల్దార్, వ్యవసాయ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.






