28-10-2025 12:11:39 AM
మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోష్‌రావులపై యాదగిరిగుట్ట ఠాణాలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల ఫిర్యాదు
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 27 (విజయక్రాంతి): మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌రావులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సోమవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంగా పై ముగ్గురిపై చేసిన అవినీతి ఆరోపణలను ఆధారంగా చేసుకుని వారి పై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా హరీశ్‌రావు, సంతోష్‌రావులు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అక్రమ సంపదను కూడబె ట్టారని కవిత ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసే హరీశ్‌రావును మాజీ కేసీఆర్ నీటిపారుదల శాఖ నుంచి తొలగించారని ఆమె మీడియాతో అన్నారు.
హరీశ్‌రావు, సంతోష్‌రావుల అక్రమ ఆస్తులకు నవీన్‌రావును బినామీగా పెట్టారని, వారి సాన్నిహిత్యం కారణంగా నవీన్‌రావ్ ఆస్తి గణనీయంగా పెరిగిందని కవిత ఆరో పించారు. వాటిని ఆధారంగా చేసుకుని ఆ ముగ్గురిపై విచారణ జరిపి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీర్ల ఐలయ్య, చామల కిరణ్ కుమార్‌రెడ్డి కోరారు. వారి వెంట యాదాద్రి భువనగిరి డీసీసీ మాజీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఉన్నారు.