తాళపత్రాల మీద
ఎప్పుడైనా నిలబడి
మా తాటిచెట్టును చూశావా?
గర్వంగా తలెత్తుకుని
నిలబడమనే పాఠం
తనే చెబుతుంది
వంట్లో ఊపిరి జల వున్నంత కాలం
నలుగురి దాహమైనా
తీర్చమని సెలవిస్తుంది
అవమానాల గాలివానలు
అవహేళనల తుపాన్లు
అతలాకుతలం చేసినా
బెదరక నిటారుగా
నిలబడమనే ధైర్యం చెప్తుంది
తాటిచెట్టు కింద
నీడాదిదంటారు గానీ
తాటాకుల విసన కర్రలతో
మొగిల్లో ఉదయించిన
భగభగమండే సూరీడి
మంటలార్పుతూ
భూగోళాన్ని చల్లబరిచే
త్యాగం కనిపించదెవరికీ !
ఇప్పుడీ డాబాలన్ని గానీ
పేదింటి గుడిసెలకూ, పక్కా ఇళ్లకూ
ఇనుప కండరాలూ, ఉక్కు నరాలిచ్చి
జీవనావాసాలకి
జీవం పోసిన ఘనత తాటిచెట్టుదే !
పైకీ కిందకీ
ప్రాణం పెట్టి ఎక్కే గౌడన్నకి
బతుకును బొట్లు బొట్లుగా ఇట్టే
నిలువెత్తు అమృతభాండం కదా !
పిడుగుపడే, పాడుగాలికి తూలిపడే
కాలినా కూలినా ప్రతి శరీరభాగాన్ని
అవయవదానం చేసే ఆత్మీయ ఆకుపచ్చని
ప్రేమరాగం తనది !
వెళుతూ వెళుతూ.. క్షణమాగి
మా తాటిచెట్టును
తనివితీరా చూడండి !
తీరని వేదనలకు కుంగిపోయిన
బతుకులోనూ నిటారుగా నిలబడటమెట్లాగో
తాళపత్రాల మీద లిఖించి మరీ
పాఠం చెప్తుంది !!
చిత్తలూరి






