ఎట్టకేలకు రైతన్నకు భరోసా!
- ఈనెల 22నుంచి రైతుల ఖాతాల్లో జమ
ఆనందంలో జిల్లా అన్నదాతలు
సంగారెడ్డి, మార్చి 20(విజయక్రాంతి): రైతు భరోసాపై ఎట్టకేలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈనెల 22న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపించారు. ఈనెల 22న ఆది వారం సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వేదికగా తొలివిడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు.
సోమవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత నిధులు జమ చేయనున్నారు. ముం దుగా ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా మొ దటి విడత కింద ఒక ఎకరం డబ్బులు మా త్రమే జమ చేస్తారు. రెండో విడతలో మూడెకరాల వరకు, మూడో విడతలో మిగిలిన ఎకరాలకు వేయనున్నారు. సంగారెడ్డి జిల్లా లో 3 లక్షలకు పైగా రైతులు ఉండగా ఇందు లో రైతు భరోసా సాయం పొందే రైతుల వివరాలు మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే కొద్ది నెలలుగా రైతుభరోసా కోసం ఎదురుచూస్తున్న అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
నష్టపోయిన రైతులకు ఊరట...
కొందరు రైతులు రైతుభరోసా నిధులు జమ కాకపోవడంతో అప్పులు తెచ్చి రబీలో పంటలు సాగు చేశారు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాక నష్టపోయారు. ప్రస్తుతం రైతుభరోసా నిధులు జమ కానుండగా వీరికి కొంత ఊరట లభించనుంది. రబీ సీజన్ ముగిసినప్పటికీ వచ్చే వానాకాలం సాగుకు సంబంధించి ఈ డబ్బులు ఉపయోగపడే అవకాశముంది.
కొత్త మార్గదర్శకాలు ఇలా...
ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతీ రైతును సంతోషపరిచేలా నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ఎకరంలోపు ఉన్న రైతులకే మొదటి విడతలో డబ్బులు జమయ్యేవి. ఈ సారి ఎక రానికి కంటే ఎక్కువ ఉన్న రైతులకూ మొదటి విడతలో ముందుగా రూ.6 వేలు జమ చేయనుంది.
అయితే కొత్త పట్టాపాస్ బుక్ కలిగిన రైతుల ఖాతాల్లోనూ పెట్టుబడి సాయం జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 28 వరకు కటాఫ్ డేట్ గా ప్రకటించి అప్పటివరకు పట్టాపాస్ బుక్కులు పాందిన రైతులు ఏఈవోలకు పాస్ బుక్కు, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్ ప్రతులు అందజేయాల్సి ఉంటుంది.
ఏప్రిల్ నాటికి అందరి ఖాతాల్లో
అర్హులైన రైతులందరికీ ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధులు జమకానున్నాయి. మొదటి విడతలో ఎకరం నుంచి ఎన్ని ఎకరాలున్నా ఎకరం డబ్బులు ప్రభుత్వం జమ చేయనుంది. ఏప్రిల్ నాటికి రైతులందరి ఖాతాల్లో డబ్బు లు జమకానున్నాయి. కొత్త పాస్ బుక్కులు పొందిన రైతులు ఏఈవోలకు వివరాలు అందజేయాలి. రైతులు అకౌంట్ నంబర్ మార్చుకోవాలన్నా, ఇతర సమస్యలున్నా వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
శివప్రసాద్, వ్యవసాయాధికారి, సంగారెడ్డి




