మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మర్రిమడ్ల గ్రామం
- దివంగత ఉపాధ్యాయుడు మహేందర్ కుటుంబానికి రూ.1.40 లక్షల ఆర్థిక సహాయం
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామం మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కోనరావుపేట ప్రాంతంలో ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు కడకుంట్ల మహేందర్ కుటుంబానికి గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, ప్రవాస భారతీయులు (NRIలు), పూర్వ విద్యార్థులు, కుల సంఘాల ప్రతినిధులు కలిసి ఆర్థిక సహాయం అందించారు.
కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న మహేందర్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో విరాళాలు సేకరించి మొత్తం రూ.1,40,000 సమీకరించారు. ఈ మొత్తాన్ని ఆయన ఇద్దరు పిల్లల పేర్లపై పోస్టల్ శాఖలో ఫిక్స్‌డ్ డిపాజిట్ గా, ఒక్కొక్కరి పేరుపై రూ.70,000 చొప్పున జమ చేశారు. విరాళాల సేకరణలో గ్రామ ప్రజలు, యువకులు, NRIలు రూ.73,500, 2007-08 SSC బ్యాచ్ విద్యార్థులు రూ.12,500, 2005-06 SSC బ్యాచ్ రూ.18,000, యాదవ సంఘం రూ.26,500, 2008-09 SSC బ్యాచ్ రూ.10,000 అందించారు.
డిపాజిట్‌కు సంబంధించిన బాండ్ పత్రాలు, ఖాతా పుస్తకాలను గ్రామ ప్రజలు, యువకులు, అన్ని కుల సంఘాల పెద్దలు, గ్రామ పాలకవర్గం సమక్షంలో మహేందర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం వచ్చినా గ్రామం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామంలో ఎవరికి ఆపద వచ్చినా ఇదే సేవాభావంతో ముందుకు సాగాలని గ్రామస్థులు పిలుపునిచ్చారు.






