తల్లి పాలే శిశువుకు సంపూర్ణ ఆహారం
- ఆలుగామలో అంతర్జాతీయ తల్లి పాల వారోత్సవాలు
కోటపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ సంధ్య, ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎం మాధవి మాట్లాడుతూ... పుట్టిన గంటలోపే శిశువుకు తల్లి పాలు పట్టించడం ఎంతో అవసరమని తెలిపారు.
పుట్టినప్పటి నుంచి మొదటి ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే శిశువుకు సంపూర్ణ ఆహారమని, తల్లి పాలలో ఉండే పోషకాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడటంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. తల్లి పాలతో శిశువుల్లో ఇన్‌ఫెక్షన్లు, పోషకాహార లోపం వంటి సమస్యలు తగ్గుతాయని, ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లి పాలు అందించాలని సూచించారు. అనంతరం గర్భిణీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మొండక్క, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.






