ఆర్టీసీ డ్రైవర్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం
రూ.90.85 లక్షల చెక్కు అందజేసిన మంత్రి పొన్నం
ముషీరాబాద్, జూలై 20(విజయక్రాంతి): నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ కోలా శంకర్ కుటుంబానికి టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల చేయూత కార్యక్రమం ద్వారా రూ.90,85,500 చెక్కును రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కళాభవన్‌లో సోమవారం ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఇతర ఉన్నతాధికారులతో కలసి శంకర్ భార్య హేమలత, కుమారుడు హేమంత్, కుమార్తె షాలిని చెక్కును అందజేశారు.
అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ శంకర్ కుటుంబానికి ఆర్టీసీ ఉద్యోగులు అండగా నిలవడం అభినందనీయమన్నారు. హేమంత్‌కు ఆర్టీసీలో ఉద్యోగం కల్పించడంతో పాటు కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని, సంస్థ పరిరక్షణ, ప్రయాణికుల సౌకర్యం, కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.






