హెచ్‌జీఏ సభ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు
హైదరాబాద్, జూలై 6 : హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్(హెచ్‌జీఏ)కు చెందిన నలుగురు సభ్యులపై గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. హెచ్‌జీఏ కార్య దర్శి సివి.రమణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రిమినల్ కుట్ర, ఫోర్జరీ, తప్పుడు ఆధారాల సృష్టి, మోసం, పరువు నష్టం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ కమిటీ సభ్యులు దిన సందీప్ రాఠీ, పి. హేమంత్ రెడ్డి, కె. ప్రతాప్ రెడ్డి, అజయ్ నాయినిలపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 335, 336(3), 318(1)తో పాటు 62, 356, 61(2) కింద కేసు నమోదు చేశారు.
అసోసియేషన్‌లో ఆర్థిక అవకతవకలు, నిబంధన లకు విరుద్ధమైన నిర్ణయాలపై ప్రశ్నించడంతో కొందరు కమిటీ సభ్యులు తనపై వ్యక్తిగత కక్ష పెంచుకున్నారనిసివి.రమణారెడ్డి ఆరోపించారు. డిసెంబర్ 25న జరిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అలుమ్నీ కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డును తర్వాత మరోచోట ఉంచి, దానికి సంబంధించిన ఫోటోలు తీసి, హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా తనపై తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై హెచ్‌జీఏ అంతర్గత విచారణ కమిటీ, తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని నివేదిక ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం సమర్పించిన ఫోటోలు ఉద్దేశపూర్వకంగా సృష్టించిన తప్పుడు ఆధారాలని, తనను కార్యదర్శి పదవి నుంచి తొలగించడం లక్ష్యంగా ఈ కుట్ర పన్నారని ఫిర్యాదులో ఆరోపించారు.






