18 May, 2026 | 1:56 AM

వైటీపీఎస్‌లో అగ్నిప్రమాదం

18-05-2026 12:57 AM
  1. దగ్ధమైన కేబుళ్లు, దెబ్బతిన్న వాల్వులు
  2. 3 రోజుల క్రితమే 3వ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం
  3. విద్యుత్ ఆయిల్ లీకేజీ, షార్ట్ సర్క్యూటే కారణం
  4. సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెను ముప్పు 
  5. నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో ఘటన

మిర్యాలగూడ, మే 17 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్ (వైటీపీఎస్)లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడు రోజుల క్రితమే ఉత్పత్తి ప్రారంభించిన 3వ యూనిట్‌లో విద్యుత్ ఆయిల్ లీకేజీ, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ జరిగిన వెంటనే దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో ప్లాంటులో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

ప్రమాదం గుర్తించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేయగా ఫైర్ సేఫ్టీ పరికరాల సహాయంతో మంటలను వెంటనే అదుపులో కి తెచ్చారు. దీంతో మంటలు ఇతర విభాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కంట్రోల్ కేబుల్స్, వాల్వ్ లు దెబ్బతిన్నప్పటికీ మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సకాలంలో చర్యలు తీసుకోవటంతో ప్రధాన యంత్రాలకు ముప్పుతప్పింది.

పంపు వద్ద ఆయిల్ లీకేజీ కావడం, షార్ట్ సర్క్యూట్ జరగటం వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనావేసిన అధి కారులు, విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితమే మూడవ యూనిట్ సిఓడి (సింక్రోనైజేడ్) పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించగా స్వల్ప వ్యవధిలోనే ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో కూడా యూనిట్ -1లో అగ్ని ప్రమాదం జరిగి భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. 4 వేల మెగా యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టిన యాదాద్రి థర్మ ల్ పవర్‌లో 8 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం గల 5 యూనిట్లను నిర్మిస్తున్నారు.

దీనిలో 1, 2,4వ యూనిట్లలో  ఉత్పత్తి ప్రారంభం కాగా, మూడు రోజుల క్రితమే మూడవ యూనిట్‌ను ప్రారంభించడం జరిగింది. మిగిలిన 5వ యూనిట్ త్వరలో పూర్తి కానుంది. 29వేల కోట్లతో ప్రారంభించిన యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్ణీత సమయానికి పూర్తి కాకపోవటంతో పాటు, ప్రభుత్వాలు మారటం, యంత్రాల ధరలు పెరగడంతో అంచన వ్య యం దాదాపు 55 వేల కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. దీనికి తోడు వరుస ప్రమాదాలతో వ్యయం మరింతగా పెరిగి ప్రభుత్వానికి మరింత ఆర్థిక భారం అవుతుందనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.