నిజాంపేట్ లో భూ 'మాయ'
ప్రైవేట్ సర్వే నెంబర్ చూపిస్తూ... ప్రభుత్వ భూమి కబ్జా
కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిపై బిల్డర్ కన్ను
ప్రైవేట్ సర్వే నెంబర్ లోనే నిర్మాణం అంటూ బాచుపల్లి రెవెన్యూ యంత్రాంగం సర్వే
రెవెన్యూ అధికారుల సహకారం ఉందంటూ స్థానికుల అనుమానాలు
కుత్బుల్లాపూర్, ఆగష్టు 18(విజయక్రాంతి): రెవెన్యూ అధికారుల ధనదాహానికి ప్రభుత్వ భూములు హారతి కర్పూరం లా కరిగిపోతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేస్తూ ప్రైవేట్ భూమిగా చూపిస్తున్న ఓ బిల్డర్ కు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారు. నిజాంపేట్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీ సర్వే నెంబర్ 103 లో ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న భవనం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది. ఓ బిల్డర్ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తూ కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్లాన్ వేశాడు. అనుమతులు ప్రైవేట్ సర్వే నెంబర్ లో తీసుకొని, ప్రభుత్వ భూమిలో భవనం నిర్మిస్తూ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.నిజాంపేట్ శ్రీనివాస నగర్ కాలనీలో శ్రీ భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఆలయం సర్వే నెంబర్ 103 లో ఉన్నట్టుగా ప్రభుత్వ రికార్డులో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయాలను ఆనుకొని ఓ బిల్డర్ భవన నిర్మాణం చేపట్టి ప్రైవేట్ సర్వే నెంబర్ చూపిస్తూ కోట్లు విలువ చేసే ప్రజాస్తిని కొల్లగొడుతున్నాడు.
తప్పుడు సర్వేలతో బిల్డర్ కు రెవెన్యూ సహకారం..!
సదరు అక్రమ నిర్మాణంపై రెవెన్యూ అధికారులకు పలు ఫిర్యాదులు అందడంతో తప్పుడు సర్వే రిపోర్ట్ చూపిస్తూ బిల్డర్ కు సహకరిస్తున్నారు. భవన నిర్మాణం సర్వే నెంబర్ 103 లో జరుగుతున్నప్పటికి రెవెన్యూ అధికారులు మాత్రం ప్రైవేట్ సర్వే నెంబర్ 104 లో ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసం అని స్థానికుల నుండి విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ నిర్మాణం దాదాపు 150 గజాల విస్తీర్ణం లో ఉంది. అయితే ప్రస్తుతం భూముల విలువ కోట్లలో పలుకుడంతో బిల్డర్ రెవెన్యూ అధికారులకు అమ్యామ్యాల రుచి చూపించి ప్రభుత్వ భూమిని తన ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుత్వ భూమిలో బిల్డర్ కు అనుమతులు ఎలా వచ్చాయి. ప్రభుత్వ భూమిలో నిర్మాణం జరుగుతుంటే రెవెన్యూ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు స్థానికులలో వ్యక్తమవుతున్నాయి.
మున్సిపల్ నుండి అనుమతులు ఎలా సాధ్యం..?
అయితే సర్వే నెంబర్ 104 మొత్తం విస్తీర్ణం 2 ఎకరాల 19 గుంటలు ప్రైవేట్ భూమిగా, సర్వే నెంబర్ 103 ప్రభుత్వ భూమి 1 ఎకరం 13 గుంటలుగా ప్రభుత్వ రికార్డులు సూచిస్తున్నాయి.లేఔట్ లో లేని ప్లాట్ కు అనుమతులు ఎలా సాధ్యం. ప్రభుత్వ స్థలాలపై స్థానికంగా వివాదాలు ఎదురుకుంటునప్పటికి ఆలయాలను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణం ఎలాంటి లేఔట్ కు సంబంధించిన ప్లాట్ కాదు. ఎన్నో సంవత్సరాలనుండి ఉంటున్న స్థానికులు నిర్ధారిస్తున్నారు. దీంతో స్పష్టంగా అర్ధమవుతుంది రెండు శాఖల అధికారులు బిల్డర్ కి ఎంతలా సహకరిస్తున్నారో.
బిల్డర్ ఓ మండల తహసీల్దార్ చుట్టం... బాచుపల్లి మండల తహసీల్దార్ సహకారం
అయితే సదరు బిల్డర్ సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఓ మండల తహసీల్దార్ చుట్టం అవ్వడం తో బాచుపల్లి మండల తహసీల్దార్ బిల్డర్ కు సహకరిస్తోందని ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన తహసీల్దార్లే ఇలా బిల్డర్లు మా చుట్టాలే అంటూ ప్రభుత్వ భూములను బిలర్లకు దాసోహం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఎడి సర్వేయర్ సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూమిలో చేపడుతున్న నిర్మాణంపై చర్యలు తీసుకొని, బిల్డర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి, బిల్డర్ కు సహరిస్తున్న బాచుపల్లి రెవెన్యూ యంత్రాంగం పై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






