calender_icon.png 2 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజు వాడీవేడి చర్చ

02-12-2025 02:02:51 AM

  1. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
  2. ‘సర్’పై విపక్షాల పట్టు సభనుంచి వాకౌట్
  3. రాజ్యసభ నేటికి వాయిదా
  4. సమావేశాల కుదింపుపై విపక్షాలు ఆగ్రహం 
  5. కొత్త ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ అధ్యక్షతన తొలిసారిగా రాజ్యసభ

న్యూఢిల్లీ, డిసెంబర్ 1 : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. లోక్‌సభ, రాజ్యసభ సమావేశమైన వెంటనే  ఇటీవల మరణించిన సభ్యులకు ఉభయ సభలు సంతాపం ప్రకటించాయి. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల గంట చేపట్టగా విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ కొంత సేపు వాయిదా పడింది. అనంతరం పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, పాన్ మసాల తయారీపై కొత్త సెస్ విధించేలా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. 

కొత్త చైర్మన్‌కు స్వాగతం

రాజ్యసభ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధాని స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. గవర్నర్‌గా ఆయన పలు రాష్ట్రాల్లో సేవలు అందించారు. ఆయన వ్యక్తిత్వం, సహనం మనందిరికీ ఆదర్శం అని మోదీ పేర్కొన్నారు.

‘సర్’పై విపక్షాల పట్టు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)పై ప్రతిక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్యాన్ని అణచివేసే చర్య అని ఆరోపిస్తూ వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఈ ప్రక్రియ వల్ల బూత్ స్థాయి అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని, అదే విధంగా ఓట్ల తొలగింపు జరుగుతుందని వ్యతిరేకిస్తూ సభలో నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు.

సభ సజావుగా జరపాలని, ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ విపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. సభ సజావుగా కొనసాగే పరిస్థితులు లేకపోవడంతో స్పీకర్  లోక్‌సభ మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం విపక్షాలు వాకౌట్ చేశాయి.

సమావేశాల కుదింపుపై ఆగ్రహం 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సాధారణంగా ఈ సమావేశాలు 20 రోజులు జరుగుతాయి. అయితే, ఈసారి 15 రోజుల పాటు మాత్రమే జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 19 వరకు సమావేశాలు జరగనుండగా, ఇందులో నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. శీతాకాల సమావేశాలను కుదించడంపై శివసేన (ఉద్దవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు చేశారు. 

15 రోజుల్లో 13 బిల్లులా: ప్రియాంక చతుర్వేది

పార్లమెంట్ సమావేశాలను సజావుగా జరిపే ఉద్దేశం అధికార పక్షానికి ఉన్నట్లు కనిపించడం లేదని ప్రియాంక చతుర్వేది అన్నారు. అహంకారంతో ప్రతిచోటా  ధికారం నిలుపుకుంటామనే భావన వారిలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ విధానాలను అనుసరించాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయంగా కనిపిస్తోందని అన్నారు. కేవలం 15 రోజుల్లో13  బిల్లులు తీసుకురావాలని చూస్తున్నారని, అంటే వీటిపై సరైన చర్చ జరగాలని వారు కోరుకోవడం లేదని అన్నారు. నిరసనల మధ్య ఈ బిల్లులను ఆమోదించాలని చూస్తున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షాలకు అవకాశం ఉండాలి:  సురేంద్ర రాజ్‌పుత్

కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సురేంద్ర రాజుపుత్ కూడా శీతాకాల సమావేశాలను కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం పార్లమెంటులో చర్చను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు ప్రజల కోసం నిర్వహిస్తారని, ప్రతిపక్షాలు ప్రజల తరఫున గళం విప్పడానికి అవకాశం ఉండాలని అన్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి లోక్ సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ఎన్డీయే ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

ప్రతిపక్షాలను నిలువరించడం ద్వారా సభను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాలను కుదించడం చూస్తుంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లుగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ శుఖ్దేవ్ భగత్ అన్నారు. జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.