తొలుత పతనం.. చివర్లో లాభాలు
కనిష్ఠస్థాయి నుంచి కోలుకున్న సూచీలు
గ్రీన్‌లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు
ముంబై, మే 13: ఎన్నికల టెన్షన్‌తో వారంరోజులుగా అతలాకుతలమవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ట్రేడింగ్ తొలిదశలో భారీగా పతమమై, చివరిగంటలో నాటకీయంగా కోలుకున్నది. నాల్గవ దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఉదయం 800 పాయింట్లకుపైగా క్షీణించిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 71,866 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ఆ కనిష్ఠస్థాయి నుంచి దాదాపు 1,000 పాయింట్లు కోలుకుని 72,863 పాయింట్ల గరిష్ఠస్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 111 పాయింట్లు లాభపడి 72,776 పాయిం ట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్ ప్రారంభంలో 230 పాయింట్ల మేర పడిపోయి 21,821 పాయింట్ల కనిష్ఠాన్ని చూసింది. ఆ స్థాయి వద్ద సాంకేతిక మద్దతు లభించడంతో వేగంగా రికవరీ అయ్యి 22,131 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. తుదకు 48 పాయింట్లు లాభపడి 22,104 పాయింట్ల వద్ద నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితర హెవీవెయిట్లు సూచీల రికవరీకి తోడ్పాటు అందించాయి.
ట్రెండ్ బలహీనమే
కనిష్ఠస్థాయి నుంచి కోలుకుని, స్వల్పలాభాలతో మార్కెట్ ముగిసినప్పటికీ, ప్రస్తుతం కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రగతి, స్టాక్స్ అధిక విలువల పట్ల ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మార్కెట్ మరింత పెరగడానికి తగిన చోదకాలు లేకపోవడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరపడం తదితర అంశాల కారణంగా సమీప భవిష్యత్తులో ట్రెండ్ బలహీనంగానే ఉంటుందని అంచనా వేశారు. ఈ వారం ఒడిదుడుకులతో మార్కెట్ మొదలైనా, కీలక హెవీవెయిట్ షేర్ల మద్దతుతో ట్రేడింగ్ చివర్లో లాభపడగలిగిందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.
బ్యాంకింగ్ నేతృత్వం
తాజాగా కనిష్ఠస్థాయి నుంచి మార్కెట్ కోలుకునేందుకు బ్యాంకింగ్ షేర్లు ర్యాలీ జరపడం ప్రధాన కారణం. నిఫ్టీని అధిగమించి బ్యాంక్ నిఫ్టీ 0.80 శాతంపైగా పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1 శాతంపైగా లాభపడ్డాయి. ఫార్మా షేర్లు సిప్లా, సన్‌ఫార్మాలు 4 శాతం మధ్య పెరిగాయి. ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, లార్సన్ అండ్ టుబ్రో, పవర్‌గ్రిడ్‌లు లాభాలతో ముగిసాయి. మరోవైపు గత వారాంతంలో ప్రకటించిన ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో టాటా మోటార్స్ షేరు 9 శాతం క్రాష్ అయ్యింది.
ఎన్టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, టైటాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెస్లేలు 1 శాతం మధ్య నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 1.41 శాతం పెరిగింది. రియల్టీ సూచి 1.32 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 1.15 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 1.03 శాతం, కమోడిటీస్ సూచి 0.79 శాతం, బ్యాంకెక్స్ 0.65 శాతం చొప్పున లాభపడ్డాయి. టెలికమ్యూనికేషన్స్, యుటిలిటీస్, కన్జూమర్ డిస్క్రీషనరీ, ఆటోమొబైల్ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచి 0.36 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.23 శాతం చొప్పున పెరిగాయి.
కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు
కొద్ది రోజుల నుంచి అదేపనిగా నిధుల్ని మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) సోమవారం సైతం విక్రయాలు జరిపారు. తాజాగా ఎఫ్‌పీఐలు రూ. 4,498 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి రూ. 23,000 కోట్లకుపైగా వెనక్కు తీసుకున్నారు.
20 దాటిన వీఐఎక్స్
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు తీవ్రంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. సోమవారం నాల్గవ దశలో 96 స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఇన్వెస్టర్ల భయాలను సూచించే వొలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) తాజాగా 20 స్థాయిని దాటిపోయింది. కేవలం పది రోజుల్లో ఇది 66 శాతంపైగా పెరిగిందని, రానున్న రోజుల్లో ఇది మరింత ఎగిసే అవకాశం ఉన్నదని, దీంతో మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుందని విశ్లేషకులు హెచ్చరించారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఇది క్రమేపీ తగ్గవచ్చని అంచనా వేస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ తెలిపారు.






