8 July, 2026 | 1:53 AM

దొడ్డిదారిలో డిఫాల్టర్లకే ఆస్తులు

14-05-2024 12:51 AM

కారుచౌకగా ఎన్‌పీఏలు బదిలీ

ఆస్తులు బ్యాంక్‌ల నుంచి ఏఆర్‌సీలకు, ఏఆర్‌సీల నుంచి ప్రమోటర్ల చేతికి

వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఆర్బీఐ అలర్ట్  l ఈనెల 17న సమావేశం

న్యూఢిల్లీ, మే 13: బ్యాంకింగ్ వ్యవస్థలో మొండి బకాయిల సమస్యను పరిష్కరించడానికి  రిజర్వ్‌బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం కలిసి తీసుకొచ్చిన వ్యవస్థలతో బ్యాంకులు బాగుపడే మాట అటుంచి, రుణ ఎగవేతదారులే తమ ఆస్తుల్ని కారుచౌకగా సొంతం చేసుకుంటున్నారు. అటు ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) రిజల్యూషన్‌లోనూ, ఇటు ఏఆర్‌సీల (అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలు) అసెట్ సేల్‌లోనూ బ్యాంక్‌లకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగవేసి డిఫాల్ట్ అయిన ప్రమోటర్లు బ్యాక్‌డోర్‌లో ఎంట్రీ ఇస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా ఏఆర్‌సీలపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో రిజర్వ్‌బ్యాంక్ ఈ వారంలో ఒక సమావేశం ఏర్పాటుచేసింది. మే 17న ముంబైలో జరగనున్న ఈ సమావేశంలో  దేశంలో రిజిష్టర్ అయిన 27 ఏఆర్‌సీల యాజమాన్యాలు పాల్గొంటాయి. ఆర్బీఐ తాజాగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏఆర్‌సీల బోర్డు చైర్మన్లు, ఆడిట్ కమిటీ చైర్మన్లు మేనేజింగ్ డైరెక్టర్లు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో ఇద్దరు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొంటారు.

డిఫాల్ట్ ప్రమోటర్లు నిషిద్ధం

బ్యాంక్‌లు రికవరీ చేయలేని మొండి బకాయిల్ని కొనుగోలు చేసిన  ఏఆర్‌సీలు నిబంధనలకు నీళ్ళొదిలి, అత్యంత చౌక ధరకు ఢిపాల్టర్లకే అప్పగిస్తున్న లావాదేవీలపై కొద్దికాలంగా పలు ఆరోపణలు వస్తున్నాయి.వాస్తవానికి ఇన్‌సాల్వెన్సీ, బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) సెక్షన్ 29ఏ ప్రకారం డిఫాల్ట్ అయిన ప్రమోటర్లు రుణదాతల పరిష్కార ప్రణాళికలో పాల్గొనడం నిషిద్ధం. కానీ అందుకు భిన్నంగా ఏఆర్‌సీలు వ్యవహరిస్తున్నాయన్నది ఆరోపణ. ఎగవేతదారులకే తిరిగి వారి ఆస్తుల్ని అత్యంత చౌకగా అప్పగిస్తున్నాయని రెండేండ్ల క్రితం ఐటీ సోదాల్లోనూ వెల్లడయ్యింది. 

ఏం జరుగుతోంది?

తొలుత బ్యాంక్‌ల నుంచి ఎగవేత కంపెనీల మెజారిటీ ఎన్‌పీఏలను (నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిలు) వేలంలో ఏఆర్‌సీలు చౌకగా కొనేస్తాయి. దీంతో డిఫాల్ట్ కంపెనీ రుణం ఏఆర్‌సీ చేతికి వస్తుంది. అటుతర్వాత  ఎన్సీఎల్టీ పర్యవేక్షణలో జరిగే కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు   ఏఆర్‌సీ ఆధిపత్యం వహిస్తుంది. ఐబీసీ నిబంధనల ప్రకారం దివాలా కంపెనీ రుణంలో 66 శాతంపైగా హోల్డ్ చేస్తున్న రుణదాత (బ్యాంకు) లేదా ఏఆర్‌సీ అనుమతిస్తేనే ఆ దివాలా కంపెనీ  విక్రయం పూర్తవుతుంది.

కార్పొరేట్ దివాలా ప్రక్రియలో లేని కంపెనీ అయితే ఏఆర్‌సీనే కొన్ని సందర్భాల్లో డిఫాల్టర్ నిరర్థక ఆస్తుల్ని (ఎన్‌పీఏలు).. సెక్యూరి టైజేషన్, రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రస్ట్ యాక్ట్ (సర్ఫాసి) కింద ఎగవేత ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు విక్రయిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వివరించాయి. మరికొన్ని సందర్భాల్లో బ్యాంకుకు రుణం ఎగవేసిన ప్రమోటర్‌తో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు సర్ఫాసీ కింద మొండి బకాయిల్ని ఏఆర్‌సీ అమ్మేస్తుందని, దీంతో దొడ్డిదారిన డిఫాల్టర్ చేతికి కారు చౌకగా ఆస్తి తిరిగి వస్తుందన్నారు. 

డిఫాల్ట్ ప్రమోటర్లతో ఏఆర్‌సీల కుమ్మక్కు

భారీ మొత్తంలో రుణం ఎగవేసి డిఫాల్ట్ అయిన ప్రమోటర్లతో ఏఆర్‌సీలు కుమ్మక్కై కారుచౌకగా ఆస్తుల్ని అప్పగిస్తున్నాయనడానికి ఆధారాలను గతంలో ఆదాయపు పన్ను శాఖ కనుగొంది. 2021 డిసెంబర్‌లో నాలుగు ఏఆర్‌సీ కార్యాలయాల్లో నిర్వహించిన ఐటీ శాఖ సోదాలు నిర్వహించి కీలకమై న పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. డిఫాల్డ్ ప్రమోటర్లు డమ్మీ కంపెనీల ద్వారా ఏఆర్‌సీల నుంచి ఎన్‌పీఏలను చౌకగా కొంటున్నా రని ఈ దాడుల్లో వెల్లడయ్యింది. వాస్తవానికి బ్యాంక్‌ల నుంచి చౌకగా మొండి బకాయిల్ని కొనడానికి  ఏఆర్‌సీలు చెల్లించే కనీస మొత్తం కూడా డిఫాల్టర్ గ్రూప్ ద్వారా అందిన నిధులేనని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) అప్పట్లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఆ నగదు డిఫాల్ట్ ప్రమోటర్ గ్రూప్ అధీనంతోని డమ్మీ కంపెనీలు లేదా హవాలా మార్గం ద్వారా ఏఆర్‌సీ లకు అందుతున్నాయన్నది. ఓంకారా అసెట్ రీకన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సీఎఫ్‌ఎం అసెట్ రీకన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వెంట్ ఏఆర్‌సీ ప్రైవేట్ లిమిటెడ్‌లకు ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీల్లో ఉన్న 60 ఆవరణల్లో ఐటీ సోదాలు జరిగాయి. బ్యాంక్‌ల నుంచి కొన్న ఎన్‌పీఏలను ఏఆర్‌సీలు తిరిగి విక్రయించడంలో పారదర్శకంగా లేని పద్ధతుల్ని అవలంబిస్తున్నాయని,  బ్యాంక్‌లకు ఎగవేసిన రుణగ్రస్తులే ఆయా ఆస్తుల వాస్తవ విలువలో పిసరంత చెల్లించి వాటిని కొనేస్తున్నారని సీబీడీటీ వివరించింది.

పన్నుల ఎగవేత.. బ్యాంక్‌ల వాటాకు కన్నం

ఏఆర్‌సీలు ఆస్తుల విక్రయంలో ఒనగూడిన లాభాల్ని ఖాతాల్లో చూపించకుండా, వాస్తవ లాభాలను సంబంధీకులకు కన్సల్టెన్సీ చెల్లింపులు లేదా అన్‌సెక్యూర్డ్ రుణాలు లేదా పెట్టుబడుల కింద మళ్లిస్తున్నాయని సోదాల్లో కొనుగొన్నట్టు సీబీడీటీ వివరించింది. ఈ విధంగా లాభాలపై పన్నుల్ని ఎగవేస్తున్నాయని, ఎన్‌పీఏల విక్రయంపై బ్యాంకులకు అందాల్సిన వాటాకు కోత వేస్తున్నాయన్నది. 

రూ.850 కోట్ల నగదు లావాదేవీలు

తమ సోదాల్లో ఒక ఏఆర్‌సీ టాలీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌పై సమాంతర ఖాతాలు నిర్వహిస్తున్నట్టు కనుగొన్నామని సీబీడీటీ తెలిపింది. ఈ సమాం తర ఖాతాల్లో రూ.850 కోట్లకుపైగా నగదు లావాదేవీలు ఉన్నాయని, చేతిరాతతో కూడిన డైరీలు లభించాయ ని, మధ్యవర్తుల నెట్‌వర్క్ ఉపయోగించుకుని ప్రమోటర్ గ్రూప్ జరిపిన లావాదేవీలు అందులో ఉన్నాయని వివరించింది. ఎన్‌పీఏలను టేకోవర్ చేయడానికి విదేశీ డమ్మీ కంపెనీల ద్వారా నిధుల్ని మళ్లించిన సాక్ష్యాలు సైతం లభించాయన్నది.