6 May, 2026 | 3:58 AM

25వేల వాహనాలకు ఫిట్‌నెస్

27-04-2024 01:08 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : హైదరాబాద్ మహానగరంలో గడువు ముగిసిన వాహనాలకు 2023 ఏడాదిలో 25,474 వాహనాలకు గ్రీన్ టాక్స్ చెల్లించడం ద్వారా ఫిట్‌నెస్ సర్టీఫికెట్లను రవాణా శాఖ అధికారులు జారీ చేశారు. గ్రేటర్ వ్యాప్తంగా 10ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో దాదాపు 1.86లక్షల వాహనాలు 15 ఏండ్ల జీవితకాలం ముగిసినవి ఉన్నట్టుగా అధికారులు వెల్లడిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో వ్యక్తిగత, వాణిజ్య వాహనాలు మొత్తం 37.29 లక్షలు ఉన్నాయి. వీటిలో కాలం చెల్లిన వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు జరిపిన అనంతరం అధికారులు ధ్రువీకరించిన వాహనాలకు గ్రీన్‌టాక్స్ చెల్లించుకుంటారు. 

ఈ ప్రకారం 2023 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు 25,474 వాహనాలకు గ్రీన్‌టాక్స్ చెల్లించారు. హైదరాబాద్‌లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 40 విద్యా సంస్థల వాహనాలకు రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్‌లు రద్దు చేశారు. 

ఫిట్‌నెస్ లేకుంటే కేసులు..

నగరంలో వాయి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు కాలం చెల్లిన వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది (2023 575 కాలం చెల్లిన వాహనాల రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు రద్దు చేశారు. కాలుష్య నివారణ సర్టీఫికెట్‌లు లేని కారణంగా 780వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, 2024 జనవరి నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 6100 వాహనాలకు పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్ రెన్యూవల్ చేశారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన పత్రాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఆర్టీఏ అధికారులు వాహనదారులకు సూచించారు. ఒకవేళ అట్టి వాహనాలకు 15ఏండ్లు నిండి ఉన్నట్టయితే, ఫిట్‌నెస్‌ను పునరుద్ధరించుకోవాలని అంటున్నారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు.