ప్రజా తీర్పును గౌరవించాలి
- ఓట్ చోరీ చేసేటోళ్లే చోరీ గురించి మాట్లాడుతున్నారు
- ప్రజలను అవమానపరిచే మాటలు సరికాదు
- మమత గెలిచినప్పుడు మేం ఏమైనా అన్నామా?
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): ఎన్నికల్లో ఓడిపోతే ప్రజా తీర్పును అంగీకరించాలని, గౌరవించాలని, కానీ, ప్రజల ను అవమానపరిచే మాటలు మాట్లాడ టం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు హితవుపలికారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు సర్వశక్తివంతమై నదని, సర్వోత్తమైనదని, దానిని అవమాన పరుస్తుంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలప డం దారుణమని మండిపడ్డారు. ‘మూడు సార్లు వెస్ట్ బెంగాల్‌లో మమత గెలిచినప్పుడు మేం ఏమైనా అన్నామా? ప్రజా తీర్పును గౌరవించాం.
కానీ, వాళ్లు ఓడిపోతే ఈవీఎంలు, ఈసీఐ (ఎన్నికల కమిషన్), దేశాన్ని నిందిస్తున్నారు’ అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉన్నదని పునరుద్ఘాటించారు. ఈనెల 10న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభ సన్నాహాకాల్లో భాగంగా మంగళవారం రాంచం దర్‌రావు తార్నాకలో వాల్ రైటింగ్ క్యాం పెయిన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెంగాల్‌లో 100 సీట్లలో ఓట్ చోరీ జరిగిందని మమత అంటున్నారని, దీనికి రాహుల్‌గాంధీ కూడా మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఓటు చోరీ చేసేటోళ్లే చోరీ గురించి మాట్లాడుతున్నారని, వీళ్లలందరికీ చోరీ అలవా టేనని, అప్పుడు గెలిచారు, ఇప్పుడు వారి చోరీ నడవట్లేదని విమర్శించారు.
మూడోసారి ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు మోదీ వస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుంటే నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రగతి పథంపై పరుగులు పెట్టిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మోదీకి ఘనస్వాగతం పలకాలని విజ్ఞప్తిచేశారు.






