ఐదు రోజులు వర్షాలే
- నేడు ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
- వడగండ్లు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): ఐదు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40-50 కి.మీ. వేగంతోపాటు వడగండ్ల వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేయగా, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
గురువారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.




