10 April, 2026 | 3:44 AM

వెబ్‌సైట్ పేరుతో ఐదారు లక్షలు వృథా!

10-04-2026 01:53 AM

రైతు కమిషన్ అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని పనులు

రైతులు, ప్రజలకు సమాచారం వెళ్లొద్దని కుట్రలు 

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు కమిషన్ 

హైదరాబాద్, ఏప్రిల్ ౯ (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు కమిషన్లను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి రైతు కమిషన్, మరొకటి విద్యా కమిషన్‌ను నియమించింది. ఈ రెండు కమిషన్లు నిర్వహించే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా వెబ్‌సైట్లను ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం కూడా సూచించింది.

వెబ్‌సైట్ల ఏర్పాటుకు నిధుల ఖర్చుకు వెసులుబాటును కూడా కల్పించింది. అధికారులు మాత్రం వ్యక్తిగత పనులకే పరిమితం కావడం, ఆఫీసులకు కూడా ఇలా వచ్చి.. అలా వెళ్లుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యా కమిషన్ మాత్రం వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి.. ఆ కమిషన్ చేపట్టే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో అప్‌లోడు చేస్తూ ముందుకెళ్లుతోంది. కానీ, రైతు కమిషన్ వెబ్‌సైట్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వెబ్‌సైట్ పేరుతో దాదాపు రూ.ఐదారు లక్షల ఖర్చు చేసిన అధికారులు.. వెబ్‌సైట్‌ను పూర్తిగా ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

విచిత్రమేమిటంటే.. వెబ్‌సైట్ కోసం రైతు కమిషన్ చైర్మన్‌తో పాటు సభ్యుల బయోడేటా, ఫొటోలు కూడా సేకరించిన అధికారులు.. వారిని ఆగౌరపర్చారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రైతుల శ్రేయ స్సు కోసం  రాష్ట్ర రైతు కమిషన్ చేస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ప్రశంసించారు.

కేరళం, నాసిక్, హర్యానా ప్రాంతాల్లో పర్యటించిన రైతు కమిషన్.. అక్కడ రైతులకు కోసం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమం చేస్తున్న పనులను పరిశీ లించడమే కాకుండా.. తెలంగాణలో అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.  కొందరు అధికారుల తీరు వల్ల రైతుల సమస్యలు పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా మిగిలిపోతున్నాయని రైతు కమిషన్ సభ్యుల్లో ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా కుట్రలు చేస్తున్నారని, వీటన్నింటిపై ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.