పిస్తా హౌస్ బిర్యానీలో ఈగలు, బొద్దింకలు
ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా ప్రవర్తించిన యాజమాన్యం, సిబ్బంది
అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 28 : పేరున్న రెస్టారెంట్‌లో కడుపు నిండా కమ్మని బిర్యానీ తిందామని వెళ్తే... ఈగలు, బొద్దింకలు, సూప్‌లో దోమలు కనిపించే సరికి వాంతు లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, నాగోల్ సర్కిల్ పెద్ద అంబర్‌పేట పరిధిలోని పిస్తా హౌస్ రెస్టారెంట్ లో శుక్రవారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్‌కు చెందిన భీమ్ రాజ్ తన స్నేహితుడితో కలిసి రాత్రివేళ భోజనం చేయడానికి అంబర్‌పేట పరిధిలోని పిస్తా హౌస్ రెస్టారెంట్ కు వెళ్ళి, బిర్యానీకి ఆర్డర్ పెట్టారు.
వేడివేడిగా వచ్చిన బిర్యానీ తిందామని చూడగా చనిపోయిన ఈగలు, బొద్దింకలు కనిపించాయి. వెంటనే సిబ్బందిని పిలిచి చూపించారు. సరైన సమాధానం చెప్పకపోగా, ఏమైనా చేసుకో అని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శనివారం సాయంత్రం హోటల్ మేనేజర్‌ని ప్రశ్నించగా, ఆదే విధంగా సమాధానం ఇచ్చారని బాధితుడు భీమ్ రాజ్ తెలిపాడు.
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న పిస్తా హౌస్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలి ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరారు. అనంతరం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిస్తా హౌస్ నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. హైటెక్ హంగులతో రెస్టారెంట్ ఏర్పాటు చేసి, నాణ్యతా లేని ఆహార పదార్థాలు వడ్డిస్తున్న హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.




