27 August, 2026 | 3:38 AM

ముంపు బాధితులు ఐక్యంగా ఉద్యమించాలి

27-08-2026 02:31 AM

ఎమ్మెల్సీ కోదండరాం

గజ్వేల్, ఆగష్టు 26: మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్వాసితులు తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్సీ కోదండరాం పిలుపునిచ్చారు. నిర్వాసితుల కన్నీటి గాథలను ప్రతిబింబించే ‘కన్నీళ్ల సాగరం’ పుస్తకాన్ని బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ, డీపీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్తో కలిసి గజ్వేల్ లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ మల్లన్నసాగర్ నిర్మాణ సమయంలో నిర్వాసితుల కోసం అనేక ఉద్యమాలు చేపట్టామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం 14 గ్రామాల ప్రజలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. నష్టపరిహారం అందని కుటుంబాలను గుర్తించి నివేదిక రూపొందించాలని, సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సజయ మాట్లాడుతూ.. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని, న్యాయం దక్కే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఏపూరి సోమన్న మాట్లాడుతూ ముంపు గ్రామాల బాధితుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి వారి పక్షాన పోరాడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పుస్తక రచయితలు పులిరాజు, రాజేందర్, కౌన్సిలర్లు విష్ణువర్ధన్రెడ్డి, వెల్దండి నరసింహారెడ్డి, ఉపేందర్రెడ్డి, దాసరి కృష్ణ, గోపాల్, చంద్రశేఖర్రెడ్డి, రాజేశం, సత్యనారాయణ, నరేందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.