13 August, 2026 | 12:37 PM

జూరాలకు తగ్గిన వరద.. మూసుకున్న గేట్లు

13-08-2026 11:58 AM

నారాయణపూర్‌ నుంచి ఇన్‌ఫ్లో తగ్గడంతో జూరాలలో వరద ఉధృతి తగ్గుముఖం

గద్వాల (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహం క్రమంగా తగ్గడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో(Jurala Project) వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా కర్ణాటకలోని నారాయణపూర్‌ జలాశయం నుంచి దిగువకు విడుదలవుతున్న నీటి ప్రవాహం తగ్గడంతో జూరాల ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కూడా గణనీయంగా తగ్గింది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టు గేట్లను గురువారం మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు.

గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నారాయణపూర్‌ నుంచి వచ్చిన వరదే జూరాల ఇన్‌ఫ్లో పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచింది. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో జూరాల వద్ద నీటి విడుదలను నియంత్రించారు. ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి విడుదల తగ్గడంతో శ్రీశైలం వైపు వెళ్లే వరద ప్రవాహం కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గతంలో వరద ఉధృతి పెరిగిన సమయంలో జూరాల నుంచి భారీగా నీటిని శ్రీశైలం వైపు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది.