ప్రవహించే వర్తమానం
హైదరాబాదు సంస్థానం విముక్తికి పూర్వం ఇక్కడి సాహిత్య సాంస్కృతిక చైతన్యాన్ని విడదీయరాని ప్రతీకల వంటి వ్యక్తులలో కాళోజీ అగ్రేసరుడు. కాళోజీని సంస్కర్త అనడం కవి అనడం రాజకీయ వాది అనడం ఏదీ పరిపూర్ణమైన సత్యం కాదు. ఆయన వర్తమానానికి వ్యక్తిరూపం. నడుస్తున్న చరిత్రగా నిటారుగా నిలబడి ఉద్విగ్నంగా హృదయంలో తోచినది అలాగే పలుకుతూ సాగిపోయినాడు. ఇలాంటి పలుకుల్లోంచి ఉపన్యాసాలు వచ్చాయి. కవిత్వం వచ్చింది. కథలు వచ్చాయి. పురాణాల వ్యాఖ్యానాలు వచ్చాయి. ఎపుడూ మాట్లాడుతూ మాట్లాడిస్తూ సమాజంలో పిరికితనంతోడి నెలకొన్న మౌనాన్ని బ్రద్దలు చేసిన మహా సాహసికుడు కాళోజీ.
నిజాంను ఎదిరించినా, రజాకార్లతో పోరాడినా, కాంగ్రె స్‌లో ఉండి ఆ ప్రభుత్వాన్ని ఎదిరించినా ఎమర్జెన్సీకి వ్యతిరేకం గా గర్జించినా ఆంధ్రప్రదేశ్ అవతరణప్పుడు స్వాగతించినా, తరువాతి అన్యాయపు ప్రభుత్వ విధానాలను తిరస్కరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నా, పౌరహక్కు ల కోసం పోరాడినా తన వ్యక్తిత్వాన్నీ, స్వచ్ఛతనూ మారిపోకుండా స్థిరబిందువు మీద నిలబడ్డ మహావ్యక్తి కాళోజీ.
కాళోజీ కవిత్వం కోసం కవిత్వం వ్రాయలేదు. ఏది రాసినా ఆయా సన్నివేశాలకు ప్రతిక్రియగా దూసుకువచ్చిన వాక్కే ఆయన కవిత్వం. ఆనాటి నైజాం రాష్ట్ర ప్రధాని వరంగల్లోని పరిస్థితులను మీర్జా ఇస్మాయిల్ విచారించటానికి వచ్చినపుడు ఆయనకు రాసిన బహిరంగ లేఖలో ఆయన ధైర్యం కొట్టవచ్చినట్టు కనబడుతుంది.
ధీరుడైన కాళోజీ తప్ప ఇంత తెగించి అడుగగలిగిన కవి మరొకరుండరు. ఆయన కవితలో అన్యాపదేశంగా రాసినా ఆక్షేపణ గుండెకు తీవ్ర శరమై తాకుతుంది. ఆ రోజుల్లో జాతీయకవిగా ప్రసిద్ధుడైన రాయప్రోలు హైదరాబాద్ సరిహద్దులోకి వచ్చేసరికి నిజాంను స్తోత్రం చేసేవాడు. ఇలాంటి వాళ్లంటే కాళోజీకి, ఆనాటి ఇక్కడి దేశభక్తులందరికీ మిక్కిలి చిరాకుగా ఉండేది. కోకిల అనే పేరుతో కాళోజీ గేయం ఈ విషయాన్ని తీవ్రంగా ప్రకటిస్తున్నది.
లేమావి చివురులను లెస్సగా మేసేవు
రుతురాజు వచ్చెనని అతి సంభ్రమముతోడ
మావికొమ్మలమీద మైమరచి పాడేవు
తిన్న తిండెవ్వారిదే కోకిలా!
పాడు పాటెవ్వారిదే కోకిలా?
కాళోజీ రచనలను మొత్తంగా చూస్తే ఒక విలక్షణాంశం మనకు కనిపిస్తుంది. ఆయన రచనల్లో వాడిన భాష ప్రాచీన కావ్య భాషకంటె భిన్నమైనది కాదు. లాక్షణిక భాషయే. ఎక్కడో ఒకచోటు మార్పు ఉండవచ్చు. కానీ, ఆయన వ్యావహారికమనే పేర అందరిమీద రుద్దబడుతున్న రెండున్నర జిల్లాల భాష ఎపుడూ వాడలేదు. లాక్షణిక భాష అయినా సరళమై పామరుల దాకా ప్రసరించగలిగింది ఆయన రచన. అందువల్ల ప్రజాకవి కావడానికి లాక్షణిక భాష విరోధం కాలేదు.
‘పార్టీ వ్రత్యం’, ‘మేతావులు’, ‘ఓట్లకు పుట్టడం’ మొదలైన కొత్త ప్రయోగాలు కాళోజీ భాషలోంచి బయటికి వచ్చాయి. ఎమర్జెన్సీ రోజులలో కాళోజీ విజృంభించి ఉపన్యసించేవాడు. ప్రత్యక్షంగా రాజకీయాలను స్పృశించిందానికంటే పరోక్షంగా రాజకీయాలను స్ఫురించేట్టుగా పోతన భాగవతంలోని ప్రహ్లా ద చరిత్రకు వ్యాఖ్యానం చెప్పేవారు. ప్రహ్లాదుడు పౌరుడై హిరణ్యకశ్యపుని రాక్షస ప్రభుత్వ నిర్భంధాలకు వ్యతిరేకంగా పోరాడినట్లుగా ఆ గాథ వ్యక్తమయ్యేది.
చాలామంది కవులు ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, అత్యవసర పరిస్థితిని స్తుతిస్తూ అనేక పద్యాలు రచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచార శాఖ ‘దీక్ష’ అనే కవితా సంపుటిని ఈ రకం స్తోత్రాలు సమకూర్చి ప్రకటించింది. దీనిలో దాశరథి, నారాయణరెడ్డి, బోయి భీమన్న, బాపురెడ్డి వంటి అనేకమంది కవుల రచనలు ఉన్నాయి. భండారు సదాశివరావు, ఘనశ్యామల ప్రసాద్ మొదలైన వాళ్ళు జైళ్ళలో ఉన్నారు. వాళ్ళకు సమాచారాన్ని గ్రంథాలను చేర్చే పనిలో అస్మదాదులం ఉన్నాము. వందేమాతరం శతాబ్ది సందర్భంలో ఒక ప్రత్యేక సంచికను కూడా ఆ కాలంలోనే ప్రచురించడం జరిగింది.
కాళోజీకి తీవ్రమైన అనుకూల వ్యతిరేక భావాలు ఉండేవి. వాటిని ఆయన ఎపుడూ దాచుకోలేదు. ఒకసారి తిట్టినా వెంటనే మరిచి పోయేవాడు. ఒకచోట ఆయన ’జన్మించెదను దేవసర్పమై నేను’ అని అనంత జీవనయాత్ర ఉత్తమ పరిణామాన్ని వ్యక్తం చేశాడు. ఆయన అంతరంగంలో ఒక గాఢమైన వైరాగ్యం ఉండేది. ‘అతిథి వాడ వుండి వుండి అవని విడిచి వెళ్ళుతాను’ అన్న సర్వసంగ పరిత్యాగి.
* ధీరుడైన కాళోజీ తప్ప ఇంత తెగించి అడుగగలిగిన కవి మరొకరుండరు. ఆయన కవితలో అన్యాపదేశంగా రాసినా ఆక్షేపణ గుండెకు తీవ్ర శరమై తాకుతుంది. ఆ రోజుల్లో జాతీయకవిగా ప్రసిద్ధుడైన రాయప్రోలు హైదరాబాద్ సరిహద్దులోకి వచ్చేసరికి నిజాంను స్తోత్రం చేసేవాడు. ఇలాంటి వాళ్లంటే కాళోజీకి, ఆనాటి ఇక్కడి దేశభక్తులందరికీ మిక్కిలి చిరాకుగా ఉండేది.
కోటగోడల మధ్య ఖూని జరిగిన చోట గుండాల గుర్తులు గోచరించినవా?
జండ ఎత్తిన యంత జంబియాలు దూసిన శిక్ష తప్పదటంచు చెప్పవచ్చితివా?
బాజార్లో బాలకుని బల్లెంబుతో బొడుచు బద్మాషునేమైన పసిగట్టినావ?
సూబాధికారులు జోహుకుం అనువారు చూట్టూ చేరి అంత చూపెట్టినార?
కాలానుగుణ్య మౌ కాళోజి ప్రశ్నలకు కళ్ళెర్ర జేసి ఖామోష్ అంటవా?
కోవెల సుప్రసన్నాచార్య






