జీవన చిత్రం
నా జీవిత కాన్వాస్ మీద
నేను ఎన్నో చిత్రాలు వేయాలి
వేస్తున్నాను కూడా.
నేను అనుకుంటున్న
చిత్రాలు కావవి
విచిత్రమేమిటంటే
కుంచె నా చేతిలోనే.
నా చేయి పట్టుకున్నది ఎవరో?
రంగులు నావే
అద్దుతున్నదీ మరెవరో.
భావచిత్రాలు, రాగచిత్రాలు
రసమయం, రంగులమయం.
ఆత్మీయబంధం, బంధాలు
ఎన్నో ఎన్నెన్నో
అలా వేస్తూనే ఉన్నా..
ఒక్కటంటే ఒక్కటీ
నాకు తృప్తినివ్వలేదు
మౌనమే మహామంత్రంగా
శూన్యపు తెరలపై
మనసు కుంచెతో
గీశాను, పరిశీలించాను.
నన్ను నేను స్పష్టంగా
చూసుకున్నాను
తత్త్వం బోధపడింది.
నన్ను పట్టుకున్న చేతిని నేనే
పట్టుకున్న రంగులన్నీ గుమ్మరించాను
చిలిపిగా కలిపేశానన్నింటినీ
ఆశ్చర్యం! అద్భుతం!!
అచ్చం నా భావాలు
అచ్చు పోసినట్టు..
అందరు మెచ్చే చిత్రం..
విస్మయంలోంచి తేరుకుంది
నే పట్టుకున్న చేయి..
అందంగా ప్రేమగా నవ్వింది..
మారింది నా జీవన చిత్రం.
గడ్డం సులోచన
సెల్: 7702891559






