8 May, 2026 | 4:45 AM

వరపుత్రుడు భీమకవి

20-05-2024 12:05 AM

శాపానుగ్రహ పటువును

రాపాడెడి కవుల నెత్తిరంపంబనగా

భూపాల సభల బూజ్యుడ

నా పేరే భీమనండ్రు నరవర! వినుమా!

అన్న ఈ చాటువు ఒక రాజుకు తన రాకను తెలియజేస్తూ చెప్పిన తీరులోనే వేములవాడ భీమకవి ఎంతటి ప్రతిభావంతుడో తెలుస్తున్నది. ఆశ్చర్యం ఏమిటంటే ఒక్కటంటే ఒక్క రచనకూడా వెలుగు చూడకున్నా ఈనాటికి కూడా సాహిత్య చరిత్రకారుల దృష్టిలో మహాకవిగా నిలిచిపోయిన భీమకవి కాలాన్ని గురించి, నివాసాన్ని గురించి విభిన్నమైన ఆలోచనలు జరుగుతూనే ఉన్నాయి. 

40కి పైగా చాటు పద్యాలు

నేటికీ భీమకవి చాటు పద్యాలు కేవలం 40కి పైగా సాహిత్య ప్రేమికుల నాలుకలపై నిలిచి నర్తిస్తున్నాయి. అందులోని 14 చాటు పద్యాలు మైలమ భీమనను గురించి కావడమే విశేషం. ఇంతటి ప్రతిభామూర్తిగా గౌరవాలను అందుకోవడానికి మరొక కారణం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలుగు సాహిత్య ప్రపంచంలో మహాప్రసిద్ధుడైన శ్రీనాథ మహాకవి మొదలు కొఱవి గోపరాజు, ఆంధ్రకవి రామయ్య, వెల్లంకి తాతంభట్టు, కవయిత్రి మొల్ల, పింగళి సూరన్న, పెదపాటి సోమనాథుడు, చిత్రకవి పెద్దన, సులక్షణసార కర్త లింగమగుంట తిమ్మన, పొత్తపి వెంకట రమణకవి, వార్తాకవి రాఘవయ్య, కాకునూరి అప్పకవి, ఓరుగంటి రామకవి, కూచిమంచి తిమ్మకవి, కస్తూరి రంగకవి, పిండిప్రోలు లక్ష్మణకవి వంటి ఎందరెందరో కవులు తమ కావ్యావతారికల్లో, తమ లక్షణ గ్రంథాల్లో వేములవాడ భీమకవిని స్తుతించడమో, ఆయన పద్యాలను ఉదాహరించడమో మనం గమనిస్తే భీమకవి ప్రతిభ అర్థమవుతుంది.

నన్నయ తరువాతి తరం

వేములవాడ భీమకవి కాలాన్ని గురించి పలువురు సాహిత్య చరిత్రకారులు పలు చర్చలు చేశారు. 

“వచియింతు వేములవాడ భీమన భంగి నుద్ధండ లీల..’ 

అన్న శ్రీనాథ మహాకవి మాటల్లోని భీమకవి ప్రశంస నన్నయ ప్రశంసకన్నా ముందు చేశాడు గనుక భీమన కవి నన్నయకన్నా ముందువాడని తొలుత కొందరు చరిత్రకారులు భావించారు. ఆ తరువాతి పరిశోధనల్లో భీమన చెప్పిన చాటువుల్లో కనిపించే కళింగ గంగు వంటి రాజుల ప్రసక్తినిబట్టి, మైలమ భీముని ప్రస్తావననుబట్టి ఇతడు నన్నయకు తరువాతి వాడుగానే స్థిరాభిప్రాయాన్ని వెలువరించారు. 

మైలమ భీముని గురించి చెప్పిన ప్రసిద్ధమైన చాటువు

“గరళపు ముద్ద లోహమవ గాఢమహా శనికోట్లు సమ్మెటల్ హరునయనాగ్ని కొల్మి, నురగాధిపు కోరలు ‘పట్టుకార్లు’..” అన్న ‘పట్టుకారు’ శబ్దం అన్య దేశీయం కనుక ఈయన ఎట్టి పరిస్థితుల్లోనూ నన్నయకు ముందటివాడు కాదని తేల్చారు. భీమ కవి చాటువుల్లో ‘వాడు’ శబ్దాన్ని పూర్ణానుస్వార యుక్తం గా ‘వాండు’ అని ప్రయోగించినట్లు కనిపిస్తున్న దానినిబట్టి ఈయన నన్నెచోడునికి మాత్రం ముందటివాడు కాని, సమకాలీనుడు కాని అయి ఉండవచ్చునని భావించారు. అయితే, భీమకవి నన్నయ సమకాలికుడు కాకపోయినా నన్నయ తిక్కనల నడిమి కాలం వాడని కొందరు చరిత్రకారుల భావన. 

ఈ కవి కాలాన్ని గురించి సాహిత్య చరిత్రకారులు కందుకూరి వీరేశలింగం, ఆరుద్ర, పింగళి లక్ష్మీకాంతం, ఆచార్య ఎస్.వి. రామారావు వంటి పెద్దలు అందరూ వివిధ ప్రమాణాలతో నిర్ధారించే ప్రయత్నం చేశారు. ఏ కావ్యం కూడా లభించకున్నా చాటువుల్లో ప్రస్తావించబడ్డ వ్యక్తులను ఆధారంగా చేసుకొని తమతమ నిర్ణయాలను వెలువరించారు. ఆచార్య ఎస్.వి. రామారావు వేములవాడ భీమన క్రీ.శ.1327 ప్రాంతంలో ఉన్న కవిగా 2017లో వారు వెలువరించిన ‘సమగ్ర తెలుగు సాహిత్య చరిత్ర’లో పేర్కొన్నారు.

భీమేశ్వరుని వరప్రసాదం

వేములవాడ భీమకవి కాలం గురించిన చర్చల వలెనే ఆయన నివాసాన్ని గురించి కూడా చర్చోపచర్చలు జరిగాయి. భీమకవి ఇంటిపేరులోనే ‘వేములవాడ’ ఉన్న కారణంగా, కరీంనగర్ జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడయే ఆయన స్వస్థలం కావచ్చునని చాలామంది భావించారు. కానీ, కొన్ని ప్రసిద్ధమైన చాటువుల్లోని మాటలనుబట్టి ఈయన ద్రాక్షారామం ప్రాంతం వాడన్న వాదనలు కూడా ఈ చర్చల్లో చోటు చేసుకున్నాయి.

“ఘనుడన్ వేములవాడ వంశజుడ ద్రాక్షారామ భీమేశనం  దనుడన్...” అన్న చాటువులో ఆయన ద్రాక్షారామ భీమేశ్వరుని ప్రస్తావించినాడు గనుక భీమకవి ద్రాక్షారామ ప్రాంతం వాడేనని అనేకులు భావించారు. 

వేములవాడ భీమ కవిని గురించి ప్రచారంలోని కథల్లో ఒకటైన ఆయన ఒక వితంతువు కుమారుడని, ఆ భీమేశ్వరుని అనుగ్రహంతో జన్మించినాడని, సమకాలికులైన కొందరు బ్రాహ్మణుల నిరసనలు బాధించినప్పుడు ఆయన ఆ భీమేశ్వరుణ్ణి ప్రశ్నించినట్టు, ఆ స్వామి కవికి శాపానుగ్రహశక్తిని ఇచ్చినట్టు వినిపించే కథనుబట్టి తూ.గో.జిల్లా ద్రాక్షారామ క్షేత్ర సమీపంలోని వేమువాడ అనే గ్రామమే ఆయన జన్మస్థలంగా నిర్ణయించారు. అయితే, కొందరు చరిత్రకారులు మరిన్ని అంతస్సాక్ష్యాల ఆధారంగా వేములవాడ కరీంనగర్ జిల్లాలోని వేములవాడగానే నిర్ధారించారు. 

కవిశేఖర సార్వభౌమ!

ఈ వేములవాడలో రెండో అరికేసరి తాత అయిన మొదటి బద్దగుడు (క్రీ.శ. 870 నిర్మించిన ప్రసిద్ధ భీమేశ్వరాలయం ఉంది. ఇది ఇక్కడి ప్రధాన దైవమైన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న విశాలమైన అతిపెద్ద ఆలయం. ఈ ఆలయంలో కొలువై వున్న దైవం భీమేశ్వరస్వామి. ఈ వేములవాడను ‘లేములవాడ’గా కూడా ఇక్కడి ప్రజలు నేటికీ వ్యవహరిస్తుంటారు. కొఱవి గోపరాజు తన కావ్యంలో భీమ కవిని ప్రస్తుతిస్తూ

“వేములవాడం జరించి, వేములవాడన్.. మెఱసిన భీముని...” 

అంటూ పద్యం చెప్పారు. ఈ కొఱవి గోపరాజు నివసించిన ఇందూరు ప్రాంతానికి దగ్గరి ప్రాంతం ఈ వేములవాడ. 

“వేములవాడ భీమ భళిరే కవిశేఖర సార్వభౌమ...” 

అన్న చాటు పద్యంలో వేములవాడను ‘లేములవాడ’గా పేర్కొనడం కూడా దీన్నే స్థిరపరుస్తున్నది. అంతేగాక

“ఆనీతాభ్య పదాన శృంఖల పరాభ్యాలంబిత స్తంభమా! 

నేనే వేములవాడ భీమకవి నేనిం జిత్రకూటంబులో..”

అన్న చాటు పద్యంలోని ‘చిత్రకూటం’ కరీంనగర్ జిల్లాలోని రామగిరికి సమీపంలో ఉంటుంది. 

వేములవాడ వాస్తవ్యుడే

ప్రముఖ పండితులు, పరిశోధకులు అయిన కీ.శే. మానవల్లి రామకృష్ణ కవి ‘నీతిశాస్త్ర ముక్తావళి’కి రాసిన పీఠికలో తొలిసారి ఈ భీమ కవి నైజాం ప్రాంతం వాడని వ్రాశారు. మాన్యులు కీ.శే. జయంతి రామయ్య పనుపున ఆంధ్ర సాహిత్య పరిషత్తు కొరకు అవసరమైన పరిశోధనకై పంపబడిన శేషాద్రి రమణ కవులలో ఒకరైన దూపాటి వెంకట రమణాచార్యుల వారుకూడా వేములవాడ భీమకవి నైజాం ప్రాంతం వాడని తేల్చి చెప్పారు. ఇంకా ఇటీవలి గ్రంథాలలో డా॥ ముదిగంటి సుజాతారెడ్డి, డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మరిన్ని ప్రమాణాలతో భీమకవి నివాసం కరీంనగర్ జిల్లాలోని శైవ క్షేత్రమైన వేములవాడగానే నిర్ధారించారు.

శ్రీనాథుని వంటి మహాకవి ప్రశంసించినట్లు ఉద్ధండరీతిలో కవిత్వాన్ని చెప్పగల సమర్థుడైన భీమకవి చాటువులుగా ప్రసిద్ధి చెందిన “హయమది సీతగాగ”, “రామునమోఘ బాణము ను”, “శంభు వరప్రసాద కవి సంఘవరేణ్యుడ”, “చక్కదనంబు దీవియగు” ఇత్యాది పద్యాలు నేటికీ సాహితీప్రియుల నాలుకలపై నర్తిస్తుండడం కవి ప్రతిభకు నిదర్శనం. ఒక్క రచన కూడా లభించకున్నా సాహిత్య చరిత్రలో స్థానం సుస్థిరం చేసుకున్న వేములవాడ భీమకవి అజరామరుడైన ప్రతిభామూర్తి అనడం అతిశయోక్తి ఏమీ కాదు.

‘తొలి ద్వ్యర్థి కావ్యకవి’గా ఘనత

వేములవాడ భీమకవి రచనలుగా ‘రాఘవ పాండవీయం’ (ద్వ్యర్థి కావ్యం), ‘శతకంఠ రామాయణం’, ‘నృసింహ పురాణం’ పేర్లు మాత్రమే తెలుస్తున్నాయి. ఏ గ్రంథం కూడా వెలుగు చూడలేదు. పింగళి సూరన్న తన రచనయైన ‘రాఘవ పాండవీయ’ ద్వ్యర్థి కావ్యావతారికలో పేర్కొన్న

“భీమన తొల్లి జెప్పెనను పెద్దల మాటయెగాని, యందు నొండేమియు నేయెడ న్నిలుచుటెవ్వరు గానరు..’ 

అన్న మాటనుబట్టి మాత్రమే భీమన ‘రాఘవ పాండవీయ’ రచన చేసినట్టుగా తెలుస్తున్నది. ఆయన గ్రంథం లభ్యమై ఉంటే తెలుగులో అదే తొలి ద్వ్యర్థి కావ్యంగా పరిగణింపబడి ఉండేది.

గన్నమరాజు గిరిజా మనోహర బాబు

వ్యాసకర్త సెల్: 9949013448