calender_icon.png 11 November, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోకల్ పోస్టింగ్స్‌పై ఫోకస్

11-11-2025 01:26:53 AM

  1. విద్యుత్ రంగ సంస్థల్లో పైరవీలు 
  2. ప్రైమ్ ఏరియాలపై ఉద్యోగుల గురి 
  3. ఏఈ, డీడీ, ఈఈ పోస్టింగ్స్ సాధనే లక్ష్యం 
  4. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వెచ్చించేందుకు సిద్ధం 
  5. పోస్టింగ్ వస్తే ‘అమ్యామ్యాల’తో కోట్లు వెనకేసుకోవచ్చనేది ప్లాన్

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): విద్యుత్తు రంగ సంస్థల పరిధి లోని ఫోకల్ స్థానాల్లో ఏఈ, డీఈ, ఏడీఈ లాంటి పోస్టింగులకు అమాంతం డిమాం డ్ పెరిగింది. ఆయా స్థానాల్లో పోస్టింగ్స్ వేయించుకునేందుకు ఉద్యోగులు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. లక్షలకు లక్షలు చేయితడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు పెట్టిన ప్రతిపైసా అసలు, వడ్డీ సహా ‘అమ్యామ్యా’ ద్వారా రాబట్టుకోవచ్చనే టార్గెట్‌తో పైరవీలు చేస్తున్నారు.

అందుకు విద్యుత్తు సంస్థల డైరెక్టర్లు, సీఎండీలు, కీలక ఐఏఎస్ అధికారుల సిఫార్సు లను కూడగట్టుకుంటున్నారు. అదీ కుదరకపోతే.. ఏకంగా ప్రభుత్వ పెద్దలను ప్రస న్నం చేసుకుని ఫోకల్ పోస్టింగ్ సాధించాలని కంకణం కట్టుకుంటున్నారు. ఇబ్రా హీంబాగ్ ఏడీఈ అంబేద్కర్ నివాసాల్లో ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో  ఎంత పెద్దమొత్తంలో ఆస్తులు బయటపడ్డాయో అందరికీ తెలిసిందే.

ఏసీబీ పట్టుకున్న నగదు, బంగారం, ఆస్తులను చూసి ప్రజలు గుడ్లుతేలేశారు. అంతేకాదు.. ఇదే అధికారికి చెందిన బినామీలు, బంధువుల ఇండ్లలోనూ లెక్కలేనని ఆస్తులు వెలుగుచూశాయి. ఇంతకీ.. విషయమేంటంటే.. సదరు అంబేద్కర్‌ది కూడా ఫోకల్ పోస్టింగే. ఈ ఒక్క ఉదంతం చాలు.. అలాంటి పోస్టుల్లో ఒక్కో అధికారి ఏ మేరకు అక్రమాస్తులు పోగుచేసుకుంటారనేది అంచనా వేయవచ్చు.

అసలు ఫోకల్ అంటే..

విద్యుత్తు సంస్థలకు సంబంధించి అన్ని జిల్లాల్లోని ప్రీమియర్, సంపన్న ఏరియాలు ఈ ఫోకల్ ప్రాంతాలు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఫోకల్ ప్రాంతాలు. ప్రస్తుతం విద్యుత్తు సంస్థల పరిధిలో ఉద్యోగులు పోస్టింగ్ కోరుకునే ఫోకల్ ఏరియా మేడ్చల్ ప్రాంతం. ఆ తర్వాతి స్థానాల్లో గచ్చిబౌలి, పటాన్‌చెరు, కందుకూరు, షాద్‌నగర్, కీసర, ఇబ్రహీంబాగ్, ఆర్సీ పురం, హైటెక్‌సిటీ, మాదాపూర్ ఉన్నాయి.

ఆయా ప్రాంతాల్లో ఉన్న ఏఈ, ఏడీఈ, డీఈ పోస్టులన్నీ ఫోకల్‌కు కిందకే వస్తుంటాయి. ఈ ప్రాంతాల్లో పోస్టింగ్స్ కోసం ఉద్యోగులు పోటీపడుతున్నారు. పోస్టింగ్ దక్కించుకునేందుకు ఉద్యోగులు అప్పో సప్పో చేసి డబ్బు సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా విద్యుత్ సంస్థల డైరెక్టర్ల నుంచి మొదలుకుని ప్రభుత్వ పెద్దల వరకూ అందరినీ ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఎవరు  కోరినంత సొమ్ము వారికి ఇచ్చేందుకూ సిద్ధమవుతున్నారు.

గతంలో ఫోకల్ పోస్టింగ్స్ అంటే డైరెక్టర్లు, సీఎండీల స్థాయిలోనే పని జరిగిపోయేది. దీంతో ఉద్యోగులు ఏదోరకంగా వారిపై ఒత్తిడి తీసుకొచ్చి పోస్టింగులు పొందేవారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటే తప్ప పోస్టింగ్ రావడం లేదని తెలిసింది.

ఒక్కసారి పోస్టింగ్ వస్తే ఇక జాక్‌పాటే!

ఫోకల్ స్థానాల్లో ఒక్కసారి పోస్టింగ్ వస్తే ఇక జాక్‌పాట్ కొట్టినట్లేనని ఉద్యోగులు చెప్పుకొంటారు. ఆ పోస్టింగ్ కోసం ఒక్కో ఉద్యోగి  రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు వెచ్చిస్తున్నాడని విద్యుత్ సంస్థల ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు.  ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టి అయినా.. పోస్టింగ్ వచ్చిన తర్వాత అంతకు పదింతలు రాబట్టుకోవచ్చనేది పైరవీకారుల అంచనా.

ఇదే సమయంలో ప్రజలకు అత్యవసర సేవలు అందించే విద్యుత్ సంస్థల్లో నిజాయితీ, సామర్థ్యం, పనితీరు, సమస్యల పరిష్కారానికి చూపించే చొరవ, అత్యవసర సమయాల్లో నాయకత్వ లక్షణాలు లాంటివి చూడకుండా, ఎవరు డబ్బు ముట్టచెప్తే వారికి ఫోకల్ పోస్టింగ్స్ ఇస్తుండటంపై పలువురు ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, పోస్టింగ్స్ విషయంలో ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు ప్రమేయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అనర్హులు, అవినీతిపరులు ఫోకల్ పోస్టింగ్‌లో ఉంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలు సక్రమంగా అందవని, అత్యవసర సేవారంగాల్లో నిజాయతీ, నిబద్ధత ఉన్నవారికే ఫోకల్ పోస్టింగ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగులెవరైనా లంచాలు డిమాండ్ చేస్తే 040-23454884 నంబరుకు గానీ, 7680901912 నంబరులో గానీ ఫిర్యాదు చేయాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఆ ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణ ఉంటుందని ఇప్పటికే ఎస్పీడీసీఎల్  సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ప్రకటించిన సంగతి తెలిసిందే.